హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ పై మరోసారి లొల్లి

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లో మరోమారు అసమ్మతి తలెత్తింది. పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావుకు వ్యతిరేకంగా అసమ్మతివాదులు ఏకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా మరికొందరు ఈ గూటికి చేరుతున్నారు. తాజా పరిణామాలకు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు నివాసమే వేదికగా మారింది. తొలుత అసమ్మతి గళం వినిపించి రాజీకి వచ్చిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌, మరో ఇద్దరు నేతలు భీష్మ కిష్టయ్య, శ్రీనివాసగౌడ్‌ ఆదివారం కెప్టెన్‌ లక్ష్మీకాంతరావును కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారంలో కలుసుకున్నారు. మల్లారంలో కాసేపు చర్చించుకుని వరంగల్‌ వచ్చేశారు. కెప్టెన్‌ నివాసంలో 4 గంటలపాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మాజీ మంత్రి విజయ రామారావు, చందూలాల్‌, ఏఆర్‌ రమేశ్‌ తదితరులు కూడా పాల్గొన్నారు.

కెసిఆర్ తో సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే విషయమై అసమ్మతి నేతలు చర్చించుకున్నట్లు సమాచారం. గతంలో లేవనెత్తిన అంశాలపై ఇంత వరకు కెసిఆర్ సమాధానం చెప్పకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తాడో పేడో తేల్చుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చారు. "అందరి కోరిక మేరకు నేను మళ్లీ పార్టీలో చేరాను. అన్నీ చర్చిస్తానని అప్పుడు చెప్పారు. ఇప్పటికి 23 రోజులైంది. మేం లేవనెత్తిన అంశాలపై కెసిఆర్ ఇంత వరకు నోరుమెదపలేదు. కరీంనగర్‌కు వచ్చినప్పుడు కూడా పిలవలేదు. ఫోన్‌ చేసినా స్పందించడంలేదు. ఇంకెన్నాళ్లు చూడాలి? ఆయన నుంచి సమాధానం వస్తుందనే నమ్మకం కూడా లేదు" అని చంద్రశేఖర్‌ అన్నట్లు తెలుస్తోంది. 'అప్పట్లో తిరిగి పార్టీలోకి వచ్చేలా మధ్యవర్తిత్వం వహించింది మీరే' అంటూ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావుకు గుర్తు చేశారు. గతంలో పలుమార్లు రాజీనామా చేసి ఎందుకు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది? దీని వల్ల తెలంగాణ వాదానికి ఏమైనా లాభం జరిగిందా? పార్టీలో నష్టపోయిన వారి సంగతి ఏమిటి? అనే అంశాలపై చర్చించాల్సిందేనని చంద్రశేఖర్‌ పట్టుబట్టారు. ఇతర నేతలు కూడా ఈ వాదనను బలపరిచారు. ఈ విషయంపై కెసిఆర్ను నిలదీద్దామని కొందరు ప్రతిపాదించారు.

త్వరలో ప్రత్యేక తెలంగాణపై మేధో మథనం పేరిట ఒక సమావేశం ఏర్పాటు చేయాలని, ఈ భేటీకి కెసిఆర్ను ఆయన కుటుంబ సభ్యులను మినహా తెలంగాణ కోరుకునే వారందరినీ ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అసమ్మతి నేతలు ఒక దశలో తీవ్ర ఉద్రేకానికిలోనై అప్పటికప్పుడు కెసిఆర్కు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. కెసిఆర్కు జ్వరం వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిసి ఆయనతో మామూలుగానే మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ కెప్టెన్‌ లక్ష్మీకాంత్‌ రావు పరామర్శించారు. తమ భేటీ గురించి చెప్పారు. సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. 22వ తేదీ (బుధవారం) తరువాత శ్రావణ మాసం వస్తుందని, అప్పుడు మాట్లాడుకుందామని కెసిఆర్ బదులివ్వడంతో...వీరు అందుకు సరే అన్నట్లు తెలిసింది. వరంగల్‌ నుంచి కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు తదితరులు ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చారు. మరో అసమ్మతి నేత, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్‌ తో భేటీ అయ్యారు. 'వరంగల్‌ భేటీ' విశేషాలను పంచుకున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X