హైదరాబాద్: శాసనసభ సమావేశాల్లో పరస్పరం కత్తులు దూసుకునే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.రోశయ్య ఒకే మాటపై నిలబడ్డారు. కృష్ణా - గోదావరి బేసిన్ లోని గ్యాస్ పై రాష్ట్రానికి వాటా సాధించుకునే విషయంపై వారిద్దరు కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డారు. కెజి బేసిన్ విషయంలో రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తామని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి వాటా సాధిస్తామని రోశయ్య చెప్పారు. గ్యాస్ లో వాటాను పొందే విషయంలో ప్రభుత్వం పట్టుదలతో ఉందని ఆయన చెప్పారు. మనం భూమి ఇవ్వడమే కాకుండా గ్యాస్ ఉత్పత్తికి అన్ని విధాలా సహకరిస్తున్నామని, అందువల్ల మనకు గ్యాస్ లో వాటా ఇవ్వాలని అడుగుతున్నామని, పార్లమెంటు సభ్యులు కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన వివరించారు.
రాష్ట్రానికి వాటా ఇవ్వడానికి చట్టాలు అంగీకరించవని, గ్యాస్ పై పూర్తి హక్కులు కేంద్రానికే ఉంటాయని, అయితే గ్యాస్ లో వాటా ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని రోశయ్య అన్నారు. గ్యాస్ లో వాటా అడగడమే కాకుండా రెవెన్యూలో వాటాను కూడా అడగాలని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రం నిధుల కొరతను ఎదుర్కుంటోందని, రెవెన్యూలో వాటాను కూడా అడిగితే మనకు ప్రయోజనం ఉంటుందని, ఈ విషయంలో తాము ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని ఆయన అన్నారు. తాను చంద్రబాబు మాటలతో ఏకీభవిస్తున్నానని, కేంద్రంపై అందుకు ఒత్తిడి తెస్తామని రోశయ్య చెప్పారు.