హైదరాబాద్: తాము లోపాలు సరిదిద్దుకుంటామని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఎక్కడ లోపం జరిగిందో గుర్తించి సరిదిద్దుతామని, పార్టీని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ప్రజలు కోరుకున్నారు కాబట్టే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పుకున్నారు.
టెక్కలి ఉప ఎన్నికలో పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెసు ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. కాంగ్రెసును గెలిపించినందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఆవిర్భావం స్ఫూర్తితో కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.