హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కాళ్లు కడిగి కడుపులో తలపెట్టినా తాను కాంగ్రెసు పార్టీలో చేరే ప్రసక్తి లేదని, తనకు ఆ ఖర్మ పట్టలేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. కెసిఆర్ వచ్చినా తాము కాంగ్రెసు చేర్చుకోమని డి. శ్రీనివాస్ అనడం హాస్యాస్పదమని ఆయన శుక్రవారం రాత్రి మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తాను ఉద్యమకారుడినని, పైరవీకారుడిని కానని, తాను కెసిఆర్ ను, డిఎస్ ను కానని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ నాయకుడు తులసిరెడ్డిని ఆయన గంజాయి రెడ్డిగా అభివర్ణించారు. శ్రీశైలం ప్రాజెక్టుపై కట్టిన ప్రాజెక్టులు అక్రమమని తాను ఇటీవల ఢిల్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం పాలైన తర్వాత శవాన్ని అక్కడే పెట్టుకుని ఆయన కుమారుడు జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని శవరాజకీయాలు చేశారని ఆయన కాంగ్రెసు ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ పై వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అయిదేళ్ల పాటు తిరుగులేని నాయకుడిగా అధికారం అనుభవిస్తున్న సమయంలో తాను విభేదించి వచ్చి చంద్రబాబును గింగిరాలు తిప్పి బండకేసి కొట్టానని ఆయన అన్నారు. చంద్రబాబు మెడలు ఎంతో వంచానని ఆయన అన్నారు. తనకు ఎంపి టికెట్ ఇచ్చి చంద్రబాబు గెలిపించాడా అని ఆయన ప్రశ్నించారు. ఈపిసి విధానంపై సిబిఐ విచారణకు ముఖ్యమంత్రి రోశయ్య అంగీకరించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. రోశయ్య బురదలో ఇరుక్కుపోరాదని ఆయన అన్నారు.