వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక రాజకీయ సంక్షోభం మరింత తీవ్రం

By Santaram
|
Google Oneindia TeluguNews

Yeddyurappa
బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభం మరింత జటిలమవుతోంది. సంక్షోభం సమసిపోయిందని యడ్యూరప్ప ప్రకటించిన కాసేపటికే అలాంటిదేమీ లేదని గాలి జనార్థన రెడ్డి కుండ బద్దలు కొట్టడం పార్టీ శ్రేణుల్లో అయోమయం రేకెత్తించింది. ఈ దశలో అధిష్టానం 'గాలి' శిబిరంలోని ఎమ్మెల్యేలు దారికి రావాలని హెచ్చరిక చేయడం, ఆపై గాలి జనార్థన రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టగలమని అల్టిమేటమ్‌ జారీ చేయడం వంటి అనేకానేక నాటకీయ పరిణామల నేపథ్యంలో కర్నాటకలో మధ్యంతర ఘంటికలు మోగుతున్నాయి.

అధిష్టానంతో అనేక దఫాలుగా భేటీ అనంతరం సంక్షోభం సమసిపోయిందని యడ్యూరప్ప ప్రకటించారు. అయితే అలాంటిదేమీ లేదని, నాయకత్వ మార్పిడి జరిగి తీరవలసిందేనని ఆ కాసేపటికే గాలి జనార్థన రెడ్డి స్పష్టం చేసారు. తనకు యాభై మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అవసరమై ప్రభుత్వాన్ని పడగొట్టగలమని హెచ్చరించారు. దీనితో అధిష్టానం గాలి జనార్థన రెడ్డి శిబిరంలోని అసమ్మతి ఎమ్మెల్యేలంతా దారికి రావాలని హెచ్చరికలు జారీ చేసింది. దీనితో ఇప్పటి వరకూ గాలి జనార్థన రెడ్డికి నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలితం లేకుండా పోయాయి. గాలి జనార్థన రెడ్డి డిమాండ్లలో భాగంగా వివాదాస్పద మంత్రి శోభ కరంద్లాజేను మంత్రివర్గం నుంచి తప్పించడానికి యడ్యూరప్ప అంగీకరించడం తెలిసిందే. అయితే ఇది సరిపోదని, నాయకత్వాన్ని మార్చాల్సిందేనని గాలి వర్గం పట్టుబడుతోంది. యడ్యూరప్ప స్థానంలో స్పీకర్‌ జగదీష్‌ శట్టర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని వారు తమ డిమాండ్‌ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే జగదీష్‌ శట్టర్‌ స్పీకర్‌ పదవికి రాజీనామా చేసి సాధారణ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో కూర్చోవడానికి సిద్ధమయ్యారు.

యడ్యూరప్ప నాయకత్వాన్ని మార్చేది లేదని బిజెపి అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో గాలి జనార్థన రెడ్డి శిబిరం ఇక ప్రభుత్వాన్ని పడగొడతామని ఆఖరి అస్త్రాన్ని బయటకు తీసింది. పైగా ఈ అసమ్మతి శిబిరం ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబడుతున్న స్పీకర్‌ శట్టర్‌ కూడా తన పదవికి రాజీనామా చేయడం ఈ అల్టిమేటమ్‌కు తొలి హెచ్చరిక గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీనితో ఇక బిజెపి అధిష్టానం ముందు రెండే రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి యడ్యూరప్ప నాయకత్వాన్ని మార్చడం లేదా మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావడం. కాబట్టి ఇప్పుడో, మరి కొద్ది గంటల్లోనే కర్నాటకలో బిజెపి ప్రభుత్వం కుప్పకూలడం, మధ్యంతర ఘంటికలు మోగడం తథ్యమనిపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X