హనుమాన్ జంక్షన్: విజయవాడ సమీపంలోని హనుమాన్ జంక్షన్ వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డాక్టర్లు మృతి చెందగా, ఆరేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. బాపులపాడు మండలం వీరపల్లి వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం వాటిల్లింది. ఈ ఘటనలో భార్యాభర్తలైన ఇద్దరు డాక్టర్లు అక్కడికక్కడే మృత్యువాత చెందగా, తీవ్రగాయాలపాలై ఆరేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా క్షతగాత్రురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా మృతులు పశ్చిమగోదావరి జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరు పాలకొల్లులోని యశోదా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సతీష్‌కుమార్, హర్షలతలుగా తేలిందని చెప్పారు.