కడప: నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టి అపర కాటన్ దొరగా పేరు తెచ్చుకున్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సమాది స్ధలాన్ని కాటన్ మనవడు రాబర్ట్ సందర్శిస్తారు. ఆయన శుక్రవారం సాయంత్రం ఇడుపుల పాయకు చేరుకుంటారు. బ్రిటీషువారి పాలన కాలంలో కృష్ణా-గోదావరి నదులపై ఆనకట్టలు కట్టి తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సర్ ఆర్థర్ కాటన్ గురించి తెలియని వారుండరు. ప్రకాశం బ్యారేజీ, దవళేశ్వరం ఆనకట్ట అనగానే ఎంతటి పామరులకైనా ఆయన పేరు టక్కున గుర్తు రాక మానదు. ఆ మహనీయుని మనుమడు చార్లెస్ రాబర్ట్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
రాష్ట్ర పర్యటనలో భాగంగా శుక్రవారం రాబర్ట్ హెలికాప్టర్ లో కడప బయలుదేరి వెళ్ళారు. కడప జిల్లా జమ్మలమడుగు డివిజన్ కొండాపురం మండలంలోని గండికోట ప్రాజెక్టును ఆయన సందర్శిస్తున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఇడుపుల పాయ చేరుకుని దివంగత నేత వైఎస్‌కి నివాళులు అర్పిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.