కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరుణదేవుడే ముంచిండు: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
కరీంనగర్: పొతిరెడ్డి పాడు, పోలవరం ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించుకుపోవడానికి చేసిన అక్రమ చర్యలకు వరుణదేవుడు ముంచిండని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అన్నారు. వరుణదేవుడు మా వైపు ఉన్నాడని చెప్పుకుంటుంటే విజయవాడ, కర్నూలులను ముంచి వరుణదేవుడు తగిన శాస్తి చేసిండని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. నీటి కోసం కక్కుర్తిపడితే ఏమవుతుందో వరుణ దేవుడు చూపించాడని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు దేవాదుల ప్రాజెక్టుకు పునాది రాయి వేసి 18 నెలల్లో పూర్తి చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారని, ఆ దేవాదుల ఏమైందో దేవుళ్లకే తెలియాలని ఆయన అన్నారు. పోలీసు శాఖలో స్థానికేతర ఉద్యోగులను పంపే విషయంలో చంద్రబాబు కుట్ర చేశారని, హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆంధ్ర పోలీసులను చంద్రబాబు రెచ్చగొట్టి సుప్రీంకోర్టుకు పంపారని ఆయన అన్నారు.

గత 56 ఏళ్లుగా హామీల, వాగ్దానాల, ఒప్పందాల ఉల్లంఘన ఆంధ్ర వలస పాలకుల వంతు, ఉద్యమాలు తెలంగాణవారి వంతు అవుతోందని ఆయన అన్నారు. తాను పుట్టడడానికి రెండేళ్ల ముందే 1952లో తెలంగాణ ఉద్యమం పుట్టిందని ఆయన అన్నారు. అన్ని అంశాల్లో ఉల్లంఘనలు, చట్ట వ్యతిరేక చర్యలు కొనసాగుతూనే వస్తున్నాయని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ఉల్లంఘనలు జరుగుతూ వస్తున్నాయని ఆయన అన్నారు. తాము 2001లో ఉద్యమం చేపట్టిన తర్వాత తాము తాత్కాలిక విజయాలు సాధించామని ఆయన చెప్పారు. తాము ఉద్యమం చేస్తుంటే తమ పార్టీతోనే తెలంగాణ వస్తుందని కాంగ్రెసు నాయకులు మొత్తుకున్నారని, సభలు పెట్టారని, తామే ఉద్యమాలు చేస్తున్నామని మాజీ మంత్రి ఎం. సత్యనారాయణరావు వంద సార్లు అని ఉంటారని ఆయన అన్నారు. ఫ్రీజోన్ వ్యవహారంలో ప్రభుత్వంతో ప్రతిపక్షాలు కోవర్టు వ్యవహారం చేశాయని ఆయన అన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత లేదని ఫ్రీజోన్ విషయంలో వ్యవహరించిన తీరు వల్లనే అన్నామని ఆయన చెప్పారు. చంద్రబాబు తన వైఖరి చెప్పరని ఆయన అన్నారు.

కాంగ్రెసులో కొన్ని మొరిగే కుక్కలున్నాయని, వాటికి బలిసెటట్లు మేపి రోజూ మొరిగిస్తున్నారని, ఉద్యమాన్ని కింది మీద చేయాలనే కుట్ర చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్ర వలస దురాక్రణదారులు కబళిస్తూ వస్తున్నారని, నేడు హైదరాబాదును రేపు ఆదిలాబాదును కబళిస్తారని ఆయన అన్నారు. కడుపు మండి మాట్లాడితే తెలుగు భాష అని, మరేదో అని అంటారని, సమస్యపై ఏ ఒక్కరూ మాట్లాడడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, తెలంగాణ మేధావులు విజ్ఞత ప్రదర్శించలేదని, అందుకే కేంద్రమైనా కదులుతుందనే ఉద్దేశంతో తాను బలిదానానికి సిద్ధపడ్డానని ఆయన చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలపై, ప్రజలపై అణచివేత చర్యలకు దిగుతున్నారని, తెలంగాణ అంతటా ప్రజలు ఆందోళనకు దిగుతున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X