హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసమే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం

By Santaram
|
Google Oneindia TeluguNews

Vasantha Nageswara Rao
జగ్గయ్యపేట: గతంలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం గురించి ఉద్యమించిన వసంత నాగేశ్వరరావు ఇప్పుడు మళ్ళీ అదే కారణం కోసం క్రియాశీలమయ్యారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం కాపాడేందుకే ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి నాంది పలుకుతున్నట్లు ఆప్కాబ్‌ చైర్మన్‌ వసంత నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పాలేటి వంతెన వద్ద నుంచి ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌ నుంచి నందిగామ మండలంలోని ఐతవరం గ్రామంలో గల తన స్వగృహానికి వెళ్తున్న వసంతకు పాలేటి వంతెన వద్ద పీసీసీ సభ్యుడు రేపాల మోహన్‌రావు, రైతు క్లబ్‌ కన్వీనర్‌ కాకాని హరిబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ, 1972లో ఇదే ప్రదేశం నుంచి జై ఆంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని కూడా ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. తెలంగాణ ఇస్తే ఆంధ్ర రాష్ట్రం సహజంగానే వస్తుందని కొందరు పేర్కొంటున్నారని, ఆంధ్రుల హక్కులను సాధించడం కోసమే ఈ ఉద్యమం లేవనెత్తామన్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ జరిగిన నాటి నుంచి తెలంగాణ వాదులు ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూనే ఉన్నారన్నారు.

బ్యానర్‌ విడుదల...
ప్రత్యేకాంధ్ర ఉద్యమం ప్రారంభించిన సందర్భంగా 'ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం ప్రత్యేకాంధ్ర కావాలి' అనే నినాదంతో బ్యానర్‌ను వసంత విడుదల చేశారు. ఇదే నినాదంతో ఆంధ్రుల ప్రత్యేక ప్రతిపత్తికి తాను పోరాటం జరపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

బహిరంగ చర్చకు రెడీ
నందిగామ టౌన్‌: స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిపై ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ఆప్కాబ్‌ చైర్మన్‌ వసంత నాగేశ్వరరావు సవాల్‌ విసిరారు. స్థానిక పాత బస్టాండు సమీపాన కాంగ్రెస్‌ నాయకుడు తునికిపాటి సాయి స్వగృహంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ ఎప్పుడో బ్రిటిష్‌ పాలకుల కాలంలో జరిగిన ప్రాజెక్టుల కారణంగానే ఆంధ్ర అభివృద్ధి చెందిం దని, స్వాతంత్య్రానంతరం ఇక్కడ వారికి ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదని వివరించారు. జలయజ్ఞంలో సైతం తెలంగాణకే దివంగత సీఎం వైఎస్‌ పెద్దపీట వేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణలోనే ఉన్నాయని, ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలు కూడా అమలు చేశాయని వివరించారు. ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బ తినక ముందే అన్నదమ్ముల్లా విడిపోవటం మంచిదని ఆప్కాబ్‌ చైర్మన్‌ వసంత నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలుగువారి పట్ల ప్రత్యేక గౌరవభావం ఉందని, రాష్ట్ర విభజనకు కొట్టుకోవటం వల్ల అది తగ్గిపోతోందన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు రాజధానిలో ఉన్నతంగా బతుకుంటే, సొంత రాష్ట్రంలోనే ఆంధ్ర ప్రాంతం వారు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 1972లోనే తాను జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని రెండు నెలలపాటు జైలుశిక్ష కూడా అనుభవించానని, ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతింటే తాను సహించేది లేదని, వారికి అవమానం జరిగితే తన వాణి విన్పిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా తెలుగు మాట్లాడే వారితో రాష్ట్రం ఏర్పడిందని, తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రాంతం వారు కోరడం సబబు కాదన్నారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యుడు రేపాల మోహన్‌రావు, వేదాద్రి ఎత్తిపోతల అధ్యక్షుడు ముక్కపాటి నరసింహారావు పాల్గొన్నారు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X