హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై ఇప్పుడే మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిరాకరించారు. కమిటీ విధివిధానాలను పూర్తిగా చూసిన తర్వాతనే వాటిపై స్పందిస్తానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాగా, తెలుగుదేశం తెలంగాణ నాయకులు కమిటీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. తమ భవిష్యత్తు కార్యాచరణ కోసం సమావేశం అవుతున్నారు. కేంద్రం, కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజల ఆశలను నీరుగార్చాయని కడియం శ్రీహరి అన్నారు. కమిటీ కాలపరిమితిని చూస్తే తెలంగాణ ప్రజలను మరో సారి మోసం చేయడానికే పూనుకుందనేది అర్థమవుతోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల మరోసారి ఉద్యమించాలని ఆయన కోరారు.
తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని తెలుగుదేశం తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించి తెలంగాణను సాధించుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి