హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం శాసనసభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. విధివిధానాలపై తెలుగుదేశం తెలంగాణ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈసారి స్పీకర్ కు మూకుమ్మడిగా రాజీనామాలు అందజేయాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే తాము తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి)లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలుగుదేశం తెలంగాణ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాము కోరుకుంటున్నది రాష్ట్ర విభజన అని ఆయన స్పష్టం చేశారు. విధివిధానాల్లో ఉద్యోగులను సంప్రదిస్తామని లేకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ నాయకులంతా కలిసి ఉండాలి, కలసి నిర్ణయం తీసుకోవాలని గతంలో అనుకున్నామని ఆయన అన్నారు. అందుకు విరుద్ధంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు.
రాజీనామాలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇంతకు ముందు కేశవరావు నివాసంలో కాంగ్రెసు, తెరాస నేతలు సమావేశం కావడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. రాష్ట్ర పరిణామాలు తెలియకుండానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందా అని ఆయన అడిగారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇదే ఆఖరి అవకాశమని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ నాయకులు తెలంగాణ సాధనకు సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ అంశం ఇప్పుడు ఆత్మగౌరవ సమస్య కూడా అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా కమిటీ విధివిధానాలున్నాయని ఆయన విమర్సించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి