న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి తెలంగాణ ప్రజలను దగా చేస్తోందనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు చేసిన ప్రకటనపై మాట్లాడడానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ నిరాకరించారు. శ్రీకృష్ణ కమిటీకి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ, అన్ని ప్రాంతాల వారు సహకరించాలని ఆయన కోరారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యులంతా నిపుణులేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కమిటీ సభ్యులు నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని, ప్రతిష్ట ఉన్నవారని, ప్రముఖులని ఆయన అన్నారు. కమిటీ చిత్తశుద్ధితో పని చేస్తుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో గత రెండు నెలలుగా తలెత్తిన పరిణామాలను కమిటీ పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. సమస్య పరిష్కారానికి అన్ని ప్రాంతాల ప్రజల సహకారం కావాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు తలెత్తుతాయని, వాటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుందని, ఇటువంటి సమయాల్లో ప్రభుత్వం సమతుల్యతతో వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కమిటీ అనవసరమైన జాప్యం కూడా చేయదని ఆయన అన్నారు. కమిటీ అందరినీ పట్టించుకుంటుందని ఆయన అన్నారు. కమిటీకి సహకరించకపోతే నష్టపోయేది మనమేనని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి