వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భీమిలి ఉత్సవాలకు రంగం సిద్ధం

By Santaram
|
Google Oneindia TeluguNews

Bhimili Beach
విశాఖపట్నం: విశాఖ నగర శివారు అందాల భీమిలి ఉత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. భీమిలి పురపాలక సంఘం 150వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకట్టుకొనేలా ఉత్సవాల నిర్వహణకు భీమిలి ఎమ్మెల్యే ఎం.శ్రీనివాసరావు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జిల్లా మంత్రి పసుపులేటి బాలరాజు ప్రోద్భలంతో పురపాలక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మత్స్య, పశుసంవర్ధక మంత్రి పార్థసారథి సమక్షంలో హైదరాబాద్‌లో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఏప్రిల్‌ చివరి వారం లేదా మే మొదటి వారాల్లో ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది.

ముఖ్యమంత్రి రోశయ్య సమక్షంలో మరోమారు సమావేశమై తేదీలను ఖరారు చేయాలని నిర్ణయించింది. భీమిలి ఉత్సవాల్లో భాగంగా అయిదెకరాల భూమిలో డచ్‌ గ్రామాన్ని ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. ఇందుకు అవసరమైన భూమిని వెంటనే సమకూర్చాలని సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ జె.శ్యామలరావుకు మంత్రులు సూచించారు. భీమిలి అందాలను మరింతగా ఇనుమడింపజేసేందుకు బీచ్‌ రహదారిని బాగా అభివృద్ధి చేయాలని సమావేశం నిర్ణయించింది. ఇందులో భాగంగా రోడ్‌లో సెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.

మత్స్యకారులు, బీచ్‌రోడ్‌ పరిసర ప్రాంతాల వారికి వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలని సమావేశం నిర్ణయించింది. భీమిలి మున్సిపాలిటీకి 150 ఏళ్లు నిండిన సందర్భంగా అక్కడి స్వయం సహాయక సంఘాలన్నింటికీ వంద శాతం రుణ సదుపాయాన్ని కల్పించాలని కూడా నిర్ణయించారు. భీమిలిలో నిరుపయోగమైన బస్టాండ్‌ను తగరపువలసకు తరలించేందుకు సమావేశం అంగీకరించింది. భీమిలి శాటిలైట్‌ టౌన్‌షిప్‌ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించింది. సమావేశంలో భీమిలి ఎమ్మెల్యే ఎం.శ్రీనివాసరావు, పర్యాటక శాఖ కమిషనర్‌ జయేష్‌ రంజన్‌, వుడా వీసీ శ్రీధర్‌, భీమిలి మున్సిపల్‌ కమిషనర్‌ తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X