న్యూఢిల్లీ: ఇంధనంపై రెవెన్యూ నష్టాలు 70వేల కోట్లకు చేరే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కఠిన నిర్ణయం తప్పదని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. యూరో - 4 పెట్రోల్, డీజిల్ సరఫరా సాకుతో ధరలను మరోసారి పెంచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ ధరల పెంపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. యూరో -4 పెట్రోల్, డీజిల్ లను ఏప్రిల్ ఒకటి నుంచి 13 నగరాలకు సరఫరా చేయనున్నట్లు ఆయిల్ కార్యదర్శి ఎస్ సుందరేషన్ చెప్పారు. ఈ నగరాల్లో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కత్తా, బెంగళూర్, హైదరాబాద్, అహ్మదాబాద్ ఉన్నాయి.
శుభ్రమైన యూరో - 4 గ్రేడ్ ఇంధన ఉత్పత్తికి ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు 40 వేల కోట్ల రూపాయలతో రైఫనరీలను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పెట్రోల్ ధర లీటరుకు 46 పైసలు, డీజిల్ ధర లీటరుకు 26 పైసలు పెరిగే అవకాశం ఉంది. కఠిన నిర్ణయాలు అవసరమని ఆయన అన్నారు.