హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భగ్గుమన్న హైదరాబాద్ పాతబస్తీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Old City
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో ఆదివారం రాత్రి అల్లర్లు చెలరేగాయి. అల్లరి మూకలు స్వైర విహారం చేశాయి. రాళ్ల వర్షం, వాహనాల దహనాలు కొనసాగాయి. 144 సెక్షన్ కింద ఆంక్షలు విధించినా అల్లర్లు ఆగలేదు. సాధారణ ప్రజలు, వాహనదారులు, మీడియా ప్రతినిధులపైనా దుండగులు దాడులకు దిగారు. ఈ అల్లర్లలో దాదాపు 60 మంది గాయపడ్డారు. ఆర్టీసీ బస్సులను, ప్రైవేటు వాహనాలను తగలబెట్టారు. ప్రార్థనా మందిరాలపై దాడులు చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు పలుమార్లు లాఠీచార్జి చేశారు. బాష్ప వాయువు ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తోపాటు ఇతర బలగాలను పెద్దసంఖ్యలో మోహరించారు. తొలుత శనివారం రాత్రి హుస్సేని ఆలం పోలీస్‌ స్టేషన్ పరిధిలోని మూసాబౌలిలో జెండాలు కట్టే విషయంలో వివాదం మొదలైంది. అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది.

మధ్యాహ్నం అనూహ్యంగా సిద్దియంబర్ బజార్‌లో అలజడి మొదలైంది. మొజాంజాహీ మార్కెట్, మదీనా, గౌలిపురా, అఫ్జల్‌గంజ్, చార్మినార్ వరకు ఉద్రిక్తతలు వ్యాపించాయి. పోలీసులు తీసుకున్న చర్యల వల్ల సాయంత్రం ఐదు గంటలకు పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్లు కనిపించింది. తర్వాత కాసేపటికే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. శంషేర్‌గంజ్ ప్రాంతంలో ఓ పోలీసు అధికారి ఒక వర్గం వారిని రెచ్చగొట్టేలా మాట్లాడటంతో సాయంత్రం 5.30 తర్వాత మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. ఆలియాబాద్, శాలిబండ, శంషేర్‌గంజ్ ప్రాంతాల్లో అల్లరి మూకలు రాళ్లు రువ్వుకున్నాయి. పెట్రోలు సీసాలు విసురుకున్నాయి. రాత్రి 7 గంటలకు లాల్‌ దర్వాజా మోడ్ ప్రాంతంలో గొడవలు మొదలయ్యాయి. పది గంటల ప్రాంతంలో అల్లర్లు ఛత్రినాకా, కందికల్ గేటు ప్రాంతాలకు వ్యాపించాయి. అక్కడున్న రెండు ప్రార్థనా మందిరాలపై దాడులు జరిగాయి.

లాల్‌దర్వాజా, సయ్యద్ అలీ చబుత్రా, శంషేర్‌గంజ్, ఫలక్ నామా, ఇంజన్‌ బౌలీ, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. రాత్రి 11 గంటల సమయంలో సనత్‌ నగర్‌లోని ఒక కేఫ్‌ పై దాడి జరిగింది. తర్వాత కూడా అక్కడక్కడ అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. అల్లరి మూకల దాడుల్లో సుమారు 40 మంది గాయపడ్డారు. కొందరు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. జనం డీజీపీని చుట్టుముట్టి తమకు రక్షణ కల్పించాలని కోరారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటల నుంచి ఫలక్ నామా దిశగా వెళ్లే వాహనాలను నిలిపివేయడంతో వందలాదిమంది ఆ ప్రాంతంలో చిక్కుకుపోయారు. తమను ఇళ్లకు పంపే ఏర్పాట్లు చేయాలని వారు డీజీపిని డిమాండ్ చేశారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని, ఎవరొచ్చి దాడిచేస్తారోనని సామాన్య జనం తీవ్ర ఆందోళనలో పడ్డారు.

పాతబస్తీలో ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం రోశయ్య సత్వరం స్పందించారు. శాంతి భద్రతలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. కృష్ణా జిల్లా పర్యటన ముగించుకుని నగరానికి చేరుకున్న వెంటనే విమానాశ్రయంలోనే ఆయన పరిస్థితి సమీక్షించారు. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్, డీజీపీ ఆర్ఆర్ గిరీశ్ కుమార్, ఇంటెలిజెన్స్ ఐజీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X