హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాక్షిపై ప్రభుత్వ ప్రేమ: తేల్చిన కాగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi
హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగు పత్రికల మధ్య వార్ సాగుతూనే ఉన్నది. సాక్షి దినపత్రికపై రాష్ట్ర ప్రభుత్వం అవ్యాజమైన ప్రేమను కురిపిస్తూ వాణిజ్య ప్రకటనలు జారీ చేసిందంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక చెప్పిన విషయాలను ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రముఖంగా రాసింది. అందుకు సంబంధించి సవివరమైన వార్తా కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి. నేరుగా పేరు ప్రస్తావించకున్నా, 2008లో వైఎస్ పుత్రుడు జగన్ ప్రారంభించిన 'సాక్షి' పత్రికకు రూ.6.90 కోట్ల విలువైన ప్రకటనలను నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసినట్లు స్పష్టం చేసింది. 2007లో మొదలైన మరో పత్రికకు రూ.81 లక్షల ప్రకటనలు ఇవ్వడాన్ని కూడా తప్పుబట్టింది. వరుసగా ఆరు నెలల పాటు ప్రచురణ జరిగిన పత్రికలకు మాత్రమే ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలి. పత్రికలకు ప్రభుత్వ మద్దతు లేకుండా ఆరు నెలల పాటు మనుగడ సాగించే సామర్థ్యం ఉందా లేదా అనే విషయాన్ని ఈ నిబంధన పరీక్షిస్తుంది.

ప్రచురణ ప్రారంభించి ఆరు నెలలు దాటిన పత్రికలను మాత్రమే 'ఎంపానెల్‌మెంట్' జాబితాలో చేరుస్తారు. వాటికే ప్రభుత్వం ప్రకటనలు జారీ చేయాలి. అయితే రెండు పత్రికల విషయంలో ఆరు నెలల నిబంధనను సడలించారు. 'సాక్షి' పత్రికను 2008 మార్చి 23న ప్రారంభించారు. దీనిని నెల రోజులకే (ఏప్రిల్ 25న) ఎంపానెల్‌మెంట్ జాబితాలో చేర్చారు. భారీ స్థాయిలో ప్రకటనలు గుప్పించారు. 'అత్యవసరం' అనే సాకుతో సాక్షి పత్రికపై చూపిన ప్రేమ వల్ల ఇతర పత్రికల వ్యాపార అవకాశాలను దెబ్బతీసినట్లయిందని కాగ్ వెల్లడించింది. ప్రకటనల రూపంలో ప్రభుత్వ అభిమాన పత్రికకు అనుచిత లబ్ధి చేకూరినట్టు స్పష్టమవుతోందని అభిప్రాయపడింది. 2008-09 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన నివేదికలో కాగ్ ఈ విషయాలు తెలిపింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చిన్నా, పెద్దా వార్తా పత్రికలకు రొటేషన్ పద్ధతిలో ప్రకటనలు విడుదల చేయాలి. అన్ని పత్రికలకు సమానావకాశాలు లభించేలా చూడడంలో ఈ రొటేషన్ విధానం ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రభుత్వం ఈ విధానాన్ని సక్రమంగా అనుసరించలేదని కాగ్ గుర్తించింది. 'అత్యవసరం' పేరిట రొటేషన్‌ను పక్కనపెట్టి ప్రభుత్వం కావాల్సిన పత్రికకు ప్రకటనల్లో పెద్ద పీట వేసింది. దీనివల్ల ఇతర పత్రికలకు నష్టం జరిగిందని కాగ్ తెలిపింది. ఈ క్రమంలో ఖర్చును నియంత్రించేందుకు సాధ్యమైనంత తక్కువ చోటు (సైజ్)లో ప్రకటనలు ఇవ్వాలనే ప్రాథమిక సూత్రాన్ని కూడా ఉల్లంఘించారు. పేజీల కొద్దీ ప్రకటనలు గుప్పించారు. ప్రకటనల విడుదల విషయంలో సమాచార శాఖ నోడల్ సంస్థగా వ్యవహరిస్తుంది. ఖర్చు మాత్రం సంబంధిత శాఖలే భరించాలి.

ఐతే ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల వద్ద ప్రకటనల ఖర్చు కోసం నిధులు ఉన్నాయా, లేవా అని నిర్ధారించుకోకుండానే సమాచార శాఖ వాటి తరఫున ప్రకటనలు జారీ చేసింది. చివరికి, ఆ సంస్థలు నిధులు లేవని చేతులెత్తేయడంతో, ఖర్చు ప్రభుత్వంపై పడింది. 'ఎవరు చెల్లించారన్నది ప్రధానం కాదు. ఇదంతా ప్రభుత్వ ధనమే' అన్న సమాధానాన్ని కాగ్ తప్పుపట్టింది.

భారీ మొత్తంలో ఉన్న ప్రకటనల ఖర్చును బడ్జెట్ కేటాయింపుల నుంచి ఆయా సంస్థలు, కార్పొరేషన్లు భరించలేవనేందుకు ఇదే నిదర్శనమని కాగ్ తెలిపింది. ఉదాహరణకు...ఇందిరమ్మ గృహ ప్రవేశాలపై 2007 అక్టోబర్ 9, 22 తేదీల్లో గృహ నిర్మాణ సంస్థ తరఫున రూ.78.07 లక్షల విలువైన ప్రకటనలు ఇచ్చారు. హైదరాబాద్‌కు నీటి సరఫరాపై 2008 నవంబర్ 14న రూ.15.44 లక్షలతో ప్రకటనలు విడుదల చేశారు. ఈ రెండు సంస్థలు తమ వద్ద డబ్బుల్లేవని చెప్పడంతో ప్రభుత్వమే ఈ నిధులు విడుదల చేసింది. ఇలాంటి మరిన్ని ఉదంతాలను కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X