గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొండవీటి కోటకు టూరిస్టుల బాట

By Santaram
|
Google Oneindia TeluguNews

Kondaveedu Fort
గుంటూరు: చారిత్రక ప్రాధాన్యం ఉన్న కొండవీటికోటను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దన్నుట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి పేర్కొన్నారు. యడ్లపాడు మండలం కొండవీడులో 16.2కోట్లరూపాయలతో నిర్మించతలపెట్టిన కొండవీటికోట ఘాట్‌రోడ్డు నిర్మాణానికి మంత్రి అరుణకుమారి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి గల్లా మాట్లాడుతూ కొండవీటి అభివృద్ధిలో ఆర్ అండ్ బి శాఖ మాత్రమే కాకుండా పంచాయితీరాజ్, అటవీ, పర్యాటక శాఖలు కూడా భాగస్వాములు కానున్నాయని తెలిపారు. కోటను తీర్చిదిద్దడం వల్ల పరిసర గ్రామాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశముందని చెప్పారు.

నిరుద్యోగ యువతకు ఉపాథి అవకాశాలు లభిస్తాయని అరుణకుమారి అన్నారు. కుల, మత, వర్గాలకు అతీతంగా కొండవీటికోట అభివృద్ధి అందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తిచేశారు. కోటపైకి ఘాట్‌రోడ్డు నిర్మాణానికి 2007లో 5 కోట్లరూపాయలు మంజూరుచేశారని, అయితే ప్రస్తుతం అంచనా వ్యయం గణనీయంగా పెరగడంతో 16 కోట్ల 20 లక్షల రూపాయలకు చేరిందన్నారు. అయితే కోట అభివృద్ధి విషయంలో ఎంత డబ్బు వెచ్చించేందుకైనా ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టంచేశారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి మాట్లాడుతూ కొండవీటికోట వైభవాన్ని నేటితరానికి తెలియజెప్పి అంతర్జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. అన్నిశాఖల సమన్వయంతో కోటను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.

రాష్ట్ర భారీపరిశ్రమల మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...కొండవీటికోటకు ఘాట్‌రోడ్డు నిర్మాణం వల్ల జాతీయ, అంతర్జాతీయస్థాయి పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారని, దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాలు అనూహ్యంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ కొండవీటికోటను కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే గాకుండా విద్యా, సాంస్కృతిక రంగాల్లోకూడా అభివృద్ధి చేస్తే మరింత గుర్తింపు లభిస్తుందని, ఇందుకోసం ఈ ప్రాంతంలో కొండవీడు విశ్వవిశ్వవిద్యాలయాన్ని స్థాపించేలా అందరం కృషిచేద్దామని అన్నారు. కోట్లాదిరూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నందున తమశాఖ తరపున 3కోట్లరూపాయలతో డీర్‌పార్కు, ఎకో టూరిజంలను అభివృద్ధి చేస్తామని అటవీశాఖ కన్సర్వేటర్ అనూప్‌సింగ్ తెలిపారు.

ఇస్కాన్ సంస్థ అధ్యక్షుడు సత్య గోపినాథ్‌దాస్ మాట్లాడుతూ ప్రపంచం మొత్తమీద 900 కృష్ణుని దేవాలయాలున్నాయని అన్నారు. అమెరికాలోని పశ్చిమ వర్జీనియాలో 400 ఎకరాల్లో కృష్ణుని దేవాలయాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. కొండవీటికోట, పరిసర గ్రామాల్లో తమ సంస్థ 150 కోట్లరూపాయలతో వివిధ కట్టడాలు చేపడుతుందని తెలిపారు. ఇస్కాన్ చేపట్టే కార్యక్రమాలకు పరిసర గ్రామాల వాసులంతా సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తిచేశారు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X