• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వేటూరి సుందర్రామ్మూర్తి కన్నుమూత

By Santaram
|

Veturi Sundaramurthy
హైదరాబాద్: సినిమా పాటలకు కొత్తదారి చూపించిన వేటూరి సుందర్రామ్మూర్తి (75) కన్ను మూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో శనివారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో ఆయన మరణించారు. అంతకుముందు ఉదరకోశ సంబంధిత వ్యాధితో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందినా, తర్వాత ఊపిరితిత్తుల సమస్య కూడా రావడంతో ఆయనను కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి పరమపదించారు.

వేటూరికి ముగ్గురు కుమారులున్నారు. ఆయన అంత్యక్రియలను ఆదివారం బన్సీలాల్‌పేటలో నిర్వహించనున్నారు. వేటూరి మరణవార్త విన్న సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి చేరుకుని ఆయనకు కడపటి నివాళులు అర్పించారు. సినీ రచయితలు, సంగీత దర్శకులు, దర్శక నిర్మాతలు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు.

పాత్రికేయుడి నుంచి..

వేటూరి సుందర్రామూర్తి గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామంలో 1936 జనవరి 29న జన్మించారు. ఆయన తండ్రి చంద్రశేఖర శాస్త్రిది కృష్ణా జిల్లా పెద్దకళ్లేపల్లి గ్రామం. చంద్రశేఖర శాస్త్రి కొల్లూరుకు చెందిన కమలాంబను వివాహమాడి ఇల్లరికం వచ్చారు. దీంతో వేటూరికి ఇటు కొల్లూరు, పెద్దకళ్లేపల్లి గ్రామాలతో వీడని బంధం ఏర్పడింది. ఆయనకు దివిసీమ అంటే ఎంతో ఇష్టం. సినీ గేయ రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు ముందు ఆయన ఆంధ్రపత్రిక, ఆంధ్ర ప్రభ పత్రికలలో పాత్రికేయునిగా పనిచేశారు.

1976లో కళాతపస్వి కె. విశ్వనాథ్ రూపొందించిన 'ఓ సీత కథ' సినిమాతో వేటూరి సినీ గీత రచయితగా మారారు. అప్పటి నుంచి... ఇటీవలే విడుదలైన వరుడు, ఇంకా విడుదల కావాల్సిన 'విలన్' వరకు వందల సినిమాలకు ఆయన సాహిత్యాన్ని అందించారు. గీత రచనకు జాతీయ అవార్డు సాధించిన తెలుగు సినీ రచయితలలో ఆయన రెండోవారు. మాతృదేవోభవ చిత్రానికి గాను ఆయన రాసిన 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడు లేడులే' పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమగీతం అవార్డు వచ్చింది.

రెండువైపులా పదును..

సాహితీ విలువలకు పెద్దపీట వేస్తూ అద్భుతమైన గీతాలను ఆవిష్కరించాలన్నా.. జానపద శైలిలో పదాలు జాలువార్చాలన్నా, మాస్ మసాలా దట్టించాలన్నా..వేటూరి చేతికి తిరుగులేదని సినీ జీవుల నుంచి సామాన్యుల వరకు అందరూ చెప్పుకుంటారు. అనగల రాగమై తొలుత వేణువలరించి, అనలేని రాగమై మరలా వినిపించి.. మరులే కురిపించి అంటూ హృదయాన్ని నేరుగా తాకడం ఆయనకే సాధ్యం.

అలంకారాల్లో ఆయనకున్న పట్టు అపారమని, అందుకే అద్భుతమైన పాటలు ఆయన కలం నుంచి అలవోకగా వస్తాయని పండితులు వ్యాఖ్యానిస్తారు. ఒకే పదాన్ని వేర్వేరు అర్థాల్లో పలికించడం ఆయనకే సాధ్యం. మత్తుగ మల్లెలు అత్తరు చిందేవేళ చంపకమాలలు సొంపులకిస్తావా..నీ లయలు హృదయమున యమునలైన సమయమున అంటూ ఇద్దరు ప్రేమికుల మధ్య సరస సంభాషణలు చెప్పించడం బహు 'సుందర'ం. రుతువులు, రాగాలు ఆయన పాటల్లో పదేపదే దొర్లుతుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X