వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓదార్పు యాత్రపై వైయస్ జగన్ ది మూర్ఖత్వం: కె చంద్రశేఖర రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
వరంగల్: ఓదార్పు యాత్ర విషయంలో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ది మూర్ఖత్వమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యాఖ్యానించారు. తన ఓదార్పు యాత్ర ఆగదని జగన్ చేసిన ప్రకటనపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. ఇంగిత జ్ఞానం ఉండాలని ఆయన జగన్ ను ఉద్దేశించి అన్నారు. మహబూబాబాద్ సంఘటనలో గాయపడి వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన సోమవారం పరామర్శించారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్ తెలంగాణలో పర్యటించవద్దని ప్రకటన చేయలేదని, జగన్ ఓదార్పు యాత్రకు నిరసనగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాతావరణం వేడెక్కిందని, సీమాంధ్ర నాయకులు తనపై ప్రకటనలు చేశారని, అప్పుడే తాను ప్రతిస్పందించానని ఆయన అన్నారు.

వైయస్ జగన్ ది ఓదార్పు యాత్రనా, దండయాత్రనా అని ఆయన ప్రశ్నించారు. ఇనుప రాడ్లకు కాంగ్రెసు జెండాలు పెట్టుకున్నారని, బేస్ బాల్ బ్యాట్లతో వచ్చారని, పిస్టల్స్, బుల్లెట్లతో వచ్చారని, ఓదార్పు యాత్రకు ఇవన్నీ ఎందుకని ఆయన అన్నారు. కొండా మురళి, కొండా సురేఖల వల్లనే హింసాకాండ చెలరేగిందని ఆయన ఆరోపించారు. వారిని అరెస్టు చేయకుండా వారికి రాచ మర్యాదలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ నాయకులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, తెలంగాణ జెఎసి నేత కోదంరామ్ తదితర తెలంగాణవాదులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. వారిపై కేసులు ఎత్తేసి ప్రభుత్వం, డిజిపి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహబూబాబాద్ సంఘటనపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా విచారించకపోవడం మరోసారి తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు.

మహబూబాబాద్ లో మొత్తం 21 మంది గాయపడ్డారని ఆయన చెప్పారు. కొండా మురళి జరిపిన కాల్పుల వల్లనే చాలా మంది గాయపడ్డారని, దానిపై విచారణ జరిపించడం అవసరమని, లైసెన్స్ లేని గన్ లతో కాల్పులు జరిపారని ఆయన అన్నారు. మీడియాపై కూడా దాడి చేశారని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించే నీతిని జగన్ అవలంబిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సాయుధ ముఠాలు మహబూబాబాద్ లోకి ప్రవేశించాయని ఆయన ఆరోపించారు. కొండా దంపతులు రెచ్చగొట్టడం వల్లనే ప్రశాంతత దెబ్బ తిన్నదని ఆయన అన్నారు. కొండా మురళి మహబూబాబాద్ వచ్చే వరకు ప్రశాంతంగానే ఉందని, తెలంగాణవాదులు శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారని, మురళి తెలంగాణవాదులను రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X