హైదరాబాద్: తనకు శత్రువులెవరూ లేరని, తనపై దాడి చేసిందెవరో చెప్పలేనని టీవీ ఆర్టిస్టు డింపుల్ అన్నారు. మణికొండ వద్ద దాడికి గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. మంగళవారం శ్రీధర్ వర్మపై జరిగిన దాడికి, తనపై జరిగిన దాడికి సంబంధం ఉండవచ్చునని ఆమె అన్నారు. తూర్పు పడమర టీవీ సీరియల్ లో సెల్వరాజ్ ను హీరోగా తీసేసి, శ్రీధర్ వర్మను తీసుకున్నారని, అందుకు కారణాలేమిటో తెలియదని ఆమె అన్నారు. తమపై దాడి చేసిన మహిళను తాను గుర్తిస్తానని ఆమె చెప్పారు.
తనపై దాడి చేసిన మహిళ తన భర్తకు జరిగిన అవమానం మీకు జరిగితే అర్థమవుతుందని మూడు సార్లు అందని, దాన్ని బట్టి శ్రీధర్ వర్మపై జరిగిన దాడితో దీనికి సంబంధం ఉండవచ్చుననే అనుమానాలు కలుగుతున్నాయని ఆమె అన్నారు. తన అసిస్టెంట్ ఉమపై మొదట మహిళ దాడి చేసిందని, ఆ తర్వాత తనపై దాడి చేసిందని ఆమె చెప్పారు. దాడి జరిగిన తీరును ఆమె వివరించారు. మహిళ తమ కళ్లలో కారం కొట్టి ఇనుప రాడ్ తో దాడి చేసిందని ఆమె చెప్పారు. ఆరాధన సీరియల్ తో తనకు సంబందం లేదని ఆమె చెప్పారు.