అనంతపురం: తెలంగాణ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమితో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు కాంగ్రెసు రాయలసీమ పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి అండగా నిలిచారు. నిజామాబాద్ అర్బన్ లో ఓడిపోయినంత మాత్రాన డి. శ్రీనివాస్ పార్టీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గెలిచినంత మాత్రాన తెలంగాణవాదం బలంగా ఉందని భావించరాదని ఆయన అన్నారు.
జాతీయ పార్టీ కాబట్టే కాంగ్రెసు తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమిపై అధిష్టానం స్థాయిలో సమీక్ష జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు ఓటమికి ఆంధ్రా నాయకులే బాధ్యత వహించాలనడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.