డి శ్రీనివాస్ విందు సమావేశానికి సీమాంధ్ర ఎంపిలు డుమ్మా
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల మధ్య సయోధ్య కోసం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఏర్పాటు చేసిన విందు సమావేశానికి సీమాంధ్రకు చెందిన 24 మంది పార్లమెంటు సభ్యులు గైర్హాజరయ్యారు. తెలంగాణకు అనుకూలంగా వ్యవహారాలు నడుస్తున్నాయనే ఉద్దేశంతో వారు గైర్హాజరైనట్లు సమాచారం. అయితే, సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల గైర్హాజరుకు ప్రత్యేక కారణాలేమీ లేవని డి. శ్రీనివాస్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకే సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సయోధ్య కోసమే సమావేశం ఏర్పాటు చేశానని, ఇది ఆరంభం మాత్రమేనని ఆయన అన్నారు. శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో కూడా సమావేశాలు జరుగుతాయని ఆయన చెప్పారు.
భిన్నాభిప్రాయాలంటే విభేదాలు కావని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులు సమస్యలను పార్టీ వేదికలపైన మాత్రమే వెల్లడించాలని ఆయన సూచించారు. పార్టీని కలిసికట్టుగా ముందుకు నడిపించేందుకు అందరూ అంగీకరించారని ఆయన చెప్పారు. వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా పార్టీ విధానాలపై మాట్లాడాలని ఆయన అన్నారు. రాష్ట్ర పరిస్థితిపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే వరకు సంయమనం పాటించాలని కూడా ఆయన సూచించారు. పార్టీ నాయకులు ఎవరు కూడా తమ పరిధి దాటి మాట్లాడవద్దని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా పాల్గొన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని కూడా అన్నారు. డిఎస్ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని ఎంపిలు సూచించారు.