వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిసెంబర్ 30 లేదా 31న శ్రీకృష్ణ కమిటీ నివేదిక

By Pratap
|
Google Oneindia TeluguNews

VK Duggal
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితులపై డిసెంబర్‌ 30, 31 తేదీల్లో ఏదో ఒక రోజు నివేదిక సమర్పిస్తామని సంప్రదింపుల కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజా బాహుళ్యంతో సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసిన కమిటీ ప్రస్తుతం తుది నివేదిక తయారీపై కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా మూడు రోజులుగా విజ్ఞాన్‌ భవన్‌లో కమిటీ సభ్యులంతా సమావేశమై వివిధ రంగాల నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. మంగళవారం సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది పి.పి.రావు సలహాలు తీసుకున్నారు. సమావేశానంతరం జస్టిస్‌ శ్రీకృష్ణ, సభ్య కార్యదర్శి వి.కె.దుగ్గల్‌, సభ్యురాలు రవీందర్‌కౌర్‌ వేరువేరుగా విలేకర్లతో మాట్లాడారు. నివేదిక డిసెంబర్‌ 31న సమర్పిస్తామని ఒకే మాటగా చెప్పారు. దుగ్గల్‌ మాట్లాడుతూ ''ప్రణాళిక ప్రకారం సంప్రదింపుల ప్రక్రియను పూర్తి చేశాం. రాష్ట్రస్థాయిలో వందకుపైగా సంప్రదింపులు జరిపాం. కమిటీగా 17 జిల్లాలు, 35 గ్రామాలు సందర్శించాం. అదనంగా కమిటీ సభ్యులు వ్యక్తిగతంగా జిల్లాల్లో పర్యటించారు. మొత్తంమీద రాష్ట్రమంతా చుట్టివచ్చాం. జిల్లా, గ్రామ స్థాయిల్లో పర్యటించాం. ప్రాంతాల వారీగా ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడింది. రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, సామాజిక, ఆర్థిక సంస్థలు, మహిళలు, విద్యార్థులు, లాయర్లు, ఉద్యోగ వర్గాల నుంచి అద్భుతమైన సహకారం అందింది. మేం పరిశీలించాల్సిన అంశాలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం, అవగాహన వచ్చింది. సంప్రదింపుల ప్రక్రియ అక్టోబర్‌ 1కి పూర్తి చేశాం. సాంకేతిక అంశాలపై నిపుణులతో సంప్రదిస్తున్నాం. అంశాలను క్రోడీకరించి, సంప్రదించి, చర్చించి ముసాయిదా తయారుచేస్తున్నాం. నిర్ణయించిన గడువు మేరకు డిసెంబర్‌ 31లోపు నివేదిక ఇస్తాం'' అని స్పష్టం చేశారు.

కమిటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నలుగురు నిపుణులు తమకు అప్పగించిన పనిపై ఇప్పటికే ముసాయిదా నివేదికను ఇచ్చినట్లు దుగ్గల్‌ వెల్లడించారు. కొన్ని అదనపు అంశాలపై వివరణ కోరుతూ మళ్లీ వెనక్కు పంపినట్లు వివరించారు. ప్రస్తుతం వాటిపై నిపుణులు పని చేస్తున్నారని, వచ్చే వారం వరకు గడువు విధించామని వెల్లడించారు. ఇప్పటికే ఒకటి రెండు అంశాలు ఖరారయ్యాయని, ఇంకా చాలా ఖరారు కావాల్సి ఉందని చెప్పారు. తాము ఏదైనా ప్రత్యేక పనిమీద మీద ఒకటి రెండుసార్లు రాష్ట్రానికి వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలతో సంప్రదింపులు జరిపే పరిస్థితి మాత్రం ఉండదని తెలిపారు. ప్రత్యేక పని అంటే ఏంటని విలేకర్లు అడిగినప్పుడు "నివేదిక రాసే సమయంలో ఏదైనా అంశంపై సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరం వస్తే వెళ్లడం" అన్నారు. నిపుణులు, ప్రభుత్వం, లేదంటే ఇతరత్రా ఎవరైనా ఇచ్చిన నివేదిక సంతృప్తికరంగా లేకపోతే అందులోని విషయాలను నివృత్తి చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. తమకు మిగిలింది రెండు నెలలే కాబట్టి నివేదికపై కసరత్తు మొదలెట్టామన్నారు. ఇప్పటికే పదిహేను రోజులు ఆలస్యమైందని, దాన్ని కూడా అధిగమించాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌లో రక్షణ సంస్థల్లాంటి ముఖ్య అంశాలతోపాటు అన్ని కీలక విషయాలనూ దృష్టిలో పెట్టుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం తమకు అప్పగించిన విధివిధానాలను అనుసరించే ముందుకెళ్తున్నామని చెప్పారు.

నివేదికను మీడియాకూ విడుదల చేస్తారా? అని అడిగినప్పుడు "31న మేం నివేదికను కేంద్ర హోంశాఖకు అందిస్తాం" అన్నారు. మీడియాకు ఏదైనా సారాంశ పత్రం విడుదల చేస్తారా? అని అడగ్గా, '31 వరకు వేచిచూడండి' అని స్పందించారు. నివేదిక ఫార్మట్‌ ఎలా ఉంటుందని అడిగినప్పుడు, "వాళ్లు, వీళ్లు నివేదించిన అన్ని కీలకాంశాలు, సంపూర్ణ చరిత్రను దృష్టిలో ఉంచుకొని సమస్యను స్పృశిస్తాం" అన్నారు. సాగునీటి రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక బోగస్‌ అని కొన్నివర్గాలు విమర్శిస్తున్న నేపథ్యంలో మీరు స్వతంత్రంగా ఏదైనా సమాచారం సేకరించారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ "మా దగ్గర స్వతంత్రమైన నిపుణులున్నారు. వీళ్లు దేశంలో అత్యంత గౌరవప్రదమైన వ్యక్తులు. కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ ఎ.డి.మొహిలే ఉన్నారు. సాగునీటి రంగంలో ఆయన ఏదిచెబితే అదే చట్టం. ఈ రంగంపై నాకు కొంత అవగాహన ఉన్నప్పటికీ నా అభిప్రాయంపై నమ్మకం పెట్టుకోకుండా ఆయన సేవలు ఉపయోగించుకుంటున్నాం. ఆయన రాష్ట్రంలో పర్యటించి పలువర్గాల నుంచి విజ్ఞాపనలు అందుకున్నారు. ప్రాజెక్టు స్థలాలను సందర్శించారు. నివేదిక పూర్తి సాధికారంగా, పరిశోధనాపూర్వకంగా, అత్యంత విశ్వసనీయంగా ఉంటుంది. నివేదికలో పొందుపరిచిన అభిప్రాయాలపై ఎవ్వరికీ విభేదాలుండవు" అన్నారు.

సామాన్యుడు అర్థం చేసుకొనే విధంగా వారిని దృష్టిలో ఉంచుకొనే నివేదిక తయారు చేస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అత్యున్నత సాంకేతిక, భౌగోళిక అంశాలతో నివేదిక ఇవ్వమన్నారు. నివేదిక పూర్తి విశ్వసనీయంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటుందని తెలిపారు. నివేదిక నిర్ణయాత్మకంగా ఉంటుందా అని ప్రశ్నించినప్పుడు "విధివిధానాల్లో మాకేం చెప్పారు? రేంజ్‌ ఆఫ్‌ సొల్యూషన్స్‌ కోసం అన్ని వర్గాలతో సంప్రదించమని చెప్పారు. సర్వోత్కృష్టమైన పరిష్కారం కానీ, ఇతరత్రా ఏదైనా కానీ సూచించమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో అది చేస్తాం'' అన్నారు. ఏమైనా సిఫార్సులుంటాయా అని అడిగినప్పుడు "సహజంగానే ఉంటాయి. మీరు విధివిధానాలు చదవండి. ఆరో విధివిధానంలో కమిటీ రేంజ్‌ ఆఫ్‌ సొల్యూషన్స్‌ కనుక్కొని సర్వోత్కృష్ట పరిష్కారం సూచించాలని ఉంది. చివరి విధివిధానంలో కమిటీ సొంతంగా ఏదైనా సిఫార్సు చేయాలనుకుంటే చేయొచ్చని ఉంది'' అన్నారు. ఒకసారి మీరు ఆప్షన్స్‌ ఇస్తామన్నారు, ఇంకోసారి సిఫార్సులు చేస్తామంటున్నారు? అని ప్రశ్నించగా ''రెండూ ఒకటే'' అని సమాధానమిచ్చారు. అయోధ్య ఫార్ములాలా ఉంటుందా అన్న ప్రశ్నకు నవ్వుతూ "మేం కచ్చితంగా కొన్ని సర్వోత్కృష్ట పరిష్కారాలు చూపుతాం. మీరు దాన్ని ఇంప్లికేషన్స్‌తో కూడిన ఆప్షన్స్‌ అని చెప్పుకోవచ్చు. రెండూ ఒకటే" అని అన్నారు. 'ప్రతి అవకాశానికి దానికితగ్గ ప్రక్రియ ఉంటుంది, ప్రతీ అవకాశానికి మంచిచెడులు ఉంటాయి' అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X