హైదరాబాద్: తమకు పిఆర్సీని అమలు చెయ్యాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లోని పూజారులు సమ్మె బాట పట్టారు. రాష్ట్రంలోని అన్ని ముఖ్య ఆలయాల్లో ఆర్జిత సేవలు రద్దయ్యాయి. పూజారులకు తోడుగా దేవాదాయ శాఖ అధికారులు కూడా తోడయ్యారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలైన యాదగిరి గుట్ట, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, అన్నవరం, భద్రాచలం, సింహాచలం, వేములవాడ, ద్వారక తిరుమల ఆలయాలలో గురువారం ఉదయాన్నే పూజలు చేసి అనంతరం దేవాలయాలను మూసివేశారు. సింహాచలంలో ఇప్పటికే ఆందోళన ప్రారంభించారు. వారి ఆందోళన గురువారానికి 16వ రోజుకు చేరుకుంది.
కాగా ప్రభుత్వం పీఆర్సీ అమలు చేసే వరకు తమ ఆందోళన ఉంటుందని పూజారులు అంటున్నారు. ప్రభుత్వాన్ని తామేమి కారణం లేకుండానే అడగటం లేదని వారంటున్నారు. దేవాలయాలలో భక్తులు ఇచ్చిన కానుకల ద్వారా ప్రభుత్వానికే మేము జీతాలు ఇస్తున్నామని వారు అంటున్నారు. భక్తులు తమ కోర్కెల కోసం దేవుడి దగ్గరకు వస్తారు. అయితే దేవుడి దగ్గరే ఉన్న మేము, ప్రభుత్వానికి జీతాలు ఇస్తున్న మేము ఎవరిని అడగాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అందరి జీతాలు పెంచుతున్న ప్రభుత్వం తాము ప్రభుత్వ ఉద్యోగులము అయినప్పటికీ మమ్మల్ని పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి