• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కార్గిల్ ఫ్లాట్ల స్కామ్: మహారాష్ట్ర సిఎం అశోక్ చవాన్ పదవీగండం

By Pratap
|

Ashok Chavan
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌కు పదవీగండం ఏర్పడింది. ముంబయిలోని అత్యంత ఖరీదైన కొలాబా ప్రాంతంలో కార్గిల్‌ మృతవీరుల కుటుంబాలకు ఉద్దేశించిన ఫ్లాట్లను ప్రైవేటు వ్యక్తులు సొంతం చేసుకున్న కుంభకోణంలో చవాన్‌ దగ్గరి బంధువుల పేర్లు బయటికి వచ్చాయి. ఆ ఆదర్శ్ ప్లాట్లలో తన బంధువులు ప్లాట్లు తీసుకున్న విషషయం నిజమేనని, అయితే వాటిని తిరిగి ఇచ్చేశామని చవాన్ శుక్రవారం ఢిల్లీలో చెప్పారు. ఈ కుంభకోణం నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసేందుకు ఢిల్లీకి రావాలని శుక్రవారం రాత్రి చవాన్‌కు ఆదేశాలు అందాయి. ఈ వ్యవహారంలో చవాన్‌కు వ్యతిరేకంగా మీడియా తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నా ఆయనకు మద్దతుగా అధిష్ఠానం ఒక్కమాట మాట్లాడటంలేదు. దోషులెంత వారైనా శిక్ష తప్పదని అధికార ప్రతినిధి మనీష్‌ తివారీ వ్యాఖ్యానించడం చూస్తే ముఖ్యమంత్రి చవాన్‌ రాజీనామా చేయక తప్పదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

కార్గిల్‌ మృతవీరుల కుటుంబాలకు ఆశ్రయం కల్పించేందుకు ఏర్పడిన 'ఆదర్శ్‌ సొసైటీ' ముంబయిలోని నౌకాదళ కేంద్ర కార్యాలయానికిదగ్గర్లో ఉన్న భూమికోసం దరఖాస్తు పెట్టింది. రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న ఈ భూమిలో ఆరంతస్తుల భవనాన్ని నిర్మించాలని సొసైటీ తలపెట్టింది. నిజానికి ఈ భూమికి సంబంధించి రక్షణ శాఖకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఉంది. కార్గిల్‌ వీరుల వ్యవహారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా అనుమతులు ఇచ్చింది. సముద్రానికి అభిముఖంగా తాజ్‌హోటల్‌కు, ముఖేష్‌ అంబానీ నివాసానికి అత్యంత దగ్గర్లో ఉన్న ఈ ఖరీదైన స్థలంపై పలువురు ప్రముఖుల కళ్లుపడ్డాయి. దాంతో ఆరంతస్తుల భవనం 31 అంతస్తులకు మారిపోయింది. 'ఆదర్శ్‌ సొసైటీ'లో బయటి వ్యక్తులు సభ్యులయ్యారు. ఒక ఎమ్మెల్సీ నాయకత్వంలో ప్లాట్ల పందేరం జరిగిపోయింది. ఇందులో నౌకాదళానికి, సైన్యానికి చెందిన ముగ్గురు మాజీ అధిపతులు సభ్యులయ్యారు. ఎనిమిది కోట్ల రూపాయల మార్కెట్‌ విలువచేసే ఫ్లాట్లను రూ.60 లక్షలకే పుచ్చుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ అత్తగారు కూడా ఒక ఫ్లాట్‌ యజమాని అయ్యారు. ఆయన దగ్గరి బంధువులు మరో ఇద్దరు ఆదర్శ్‌ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. పలువురు ఐఏఎస్‌ అధికారులు, పర్యావరణ మాజీ మంత్రి లబ్ధి పొందిన వారిలో ఉన్నారు. అశోక్‌ చవాన్‌ రెవెన్యూ మంత్రిగా ఉండగా అన్ని అనుమతులు ఇప్పించారు.

నౌకాదళ కేంద్ర కార్యాలయం దగ్గర బహుళ అంతస్తుల భవనం రావడంపట్ల రక్షణ శాఖ ఆందోళనతో ఉంది. దీనికి అనుమతులు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. రక్షిత తీరప్రాంత నిబంధనల కింద అనుమతి తీసుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది.ఆదర్శ్‌ సొసైటీ కుంభకోణంలో మాజీ త్రివిధ దళాధిపతులు కూడా సభ్యులుగా ఉండటంతో చినికిచినికి గాలివాన అయ్యింది. దీనిపై చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి ఎ.కె.ఆంటొనీ పట్టుదల ఎక్కువయ్యింది. గురువారం ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని, ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీని కలిసి కుంభకోణాన్ని మూలాల వరకు శోధించాలని పట్టుబట్టినట్లు సమాచారం. ఇప్పటికే రక్షణ శాఖ అంతర్గతంగా దర్యాప్తు జరిపింది. క్షేత్రస్థాయిలో కొంతమంది సైనికాధికారుల పాత్ర లేనిదే 31 అంతస్తుల భవనాన్ని అక్కడ నిర్మించలేరని తేల్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X