హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాంతీయ ఉద్యమాలు ప్రగతిని వెనక్కి నెట్టాయి: ముఖ్యమంత్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకు పోతుందని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. సోమవారం నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, శత్రుచర్ల విజయరామారావు, డిజిపి ఆరవిందరావు పాల్గొన్నారు. పటిష్ట బందోపస్తు మధ్య ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

రెండున్నర దశాబ్దాల క్రితం సనత్ నగర్లో ఒక ఇండస్ర్టీ ఏర్పడిందని, ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక కేంద్రాలు ఏర్పడ్డాయని, మౌలిక సదుపాయాలు విస్తారంగా ఉన్నందువల్లనే రాష్ట్రంలో పారిశ్రామిక కేంద్రాలు విస్తరిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటి పారిశ్రామిక అభివృద్ధి మరో నలభై యాభై ఏళ్లకి ఆధారమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజాభిమానాన్ని చూరగొన్న ప్రభుత్వాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించలేమని మహాత్మాగాంధీ అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అంచెలంచెలుగా ప్రవేశపెట్టిన పలు పథకాలతో ప్రజాభిమానాన్ని చూరగొన్నదని అన్నారు. నూతన పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి వారికి పలు సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. తద్వారా భారీ ఉద్యోగాలు మనకు వస్తున్నాయని చెప్పారు.

అయితే రాష్ట్ర ప్రగతి వేగం మీద గతేడాది రాజశేఖర్ రెడ్డి మరణం, ప్రాంతీయ తత్వ ఉద్యమాలు, వరదలు, ప్రకృతి విపత్తులు, మతతత్వం ప్రభావం చూపడంతో కాస్త మందగించిందని, అర్థిక ప్రగతి అంతగా లేకున్నా గత సంవత్సరం నెట్టుకొచ్చామని చెప్పారు. అయితే ఈ సంవత్సరం ప్రగతిలో పుంజుకున్నామని చెప్పారు. ఇన్నాళ్లు రైతులను అన్నదాత అనే వాళ్లమని అయితే మన రైతులు పండించిన పంటలు ప్రపంచ దృష్టిని ఆకర్షించటంతో కీర్తిప్రధాత అని కూడా ఇప్పుడు అనవచ్చన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీటిపారుదలకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల రైతులు పంటలు పండించుకున్నారన్నారు. వ్యవసాయం, పరిశ్రమలే రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా గ్రామీణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, బిసిల అభివృద్ధికి పలు పథకాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. నీటి సామర్థ్యంలో మనమే దేశంలో ముందున్నామని చెప్పారు. మహిళల అభివృద్ధి తద్వారా గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణం, పశుక్రాంతి పథకం, ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులకు హాస్టల్స్, స్కాలర్ షిప్పులు ఇస్తున్నామని, ఇప్పుడు స్కాలర్ షిప్పులు ఆన్ లైన్ లో ఇవ్వడం ద్వారా పారదర్శకత పాటిస్తున్నామన్నారు. బలహీనవర్గాలకు ఉన్నత విద్య అందించుటరు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సొంత ఇళ్లులేని వారికి స్థలం కేటియిస్తోందని, 4 శాతం రిజర్వేషన్ను, మెడికల్ కళాశాలలు, హజ్ యాత్ర తదితర అవకాశం ముస్లింలకు కల్పించి వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పుడుతున్నామని చెప్పారు.

విద్య అభివృద్ధి కోసం బిట్స్, పలు ఇంజినీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అందరికీ వైద్యం అందాలని 104, 108, ఆరోగ్యశ్రీలను ప్రభుత్వ వేద్య విధాన పరిషత్ తీసుకువచ్చిందన్నారు. రాష్ట్రంలో క్రమంగా చనిపోయే పిల్లల సంఖ్య తగ్గడానికి 100 శాతం పోలియో చుక్కలే కారణమన్నారు. త్వరలో జవహర్ బాల ఆరోగ్య రక్ష ను ప్రభుత్వం పిల్లల ఆరోగ్యం కోసం తీసుకు వస్తుందన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నది కేవలం ఈ ప్రభుత్వమే అని ప్రజలు నమ్ముతున్నారన్నారు. మైక్రో ఆత్మహత్యలపై వెంటనే స్పందించి చట్టాన్ని తీసుకు వచ్చామన్నారు. బాబ్లీ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. తక్షణమే చర్యలు తీసుకోవటమే నాకు సంతృప్తి అన్న మహాత్ముడి మాటలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందన్నారు.

ప్రభుత్వం ముందు నిరంతర అభివృద్ధి, బలహీనవర్గాల ఉన్నతి - ఈ రెండు మనముందున్న రెండు లక్ష్యాలని ముఖ్యమంత్రి అన్నారు. కామన్వెల్తులో పతకాలు తెచ్చిన వారిని రోశయ్య మరోసారి అభినందించారు. వారు రాష్ట్రం యొక్క ప్రతిష్టను దశదిశలా వ్యాప్తి చేసారన్నారు. చివరగా తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ప్రతి ఇంట్లో తమ పిల్లలు తెలుగు మాట్లాడేలా ప్రోత్సహించాలని సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X