విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య, చంద్రబాబులపై సీమాంధ్ర విద్యార్థుల మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
విజయవాడ: ముఖ్యమంత్రి కె. రోశయ్యపై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై సీమాంధ్ర విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎస్సై రాత పరీక్షల వాయిదాపై వారు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. హైదరాబాద్ ఫ్రీజోన్ వ్యవహారంపై తప్పు పడుతూ విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తమను పరామర్శించడానికి రాలేదని ఆయనపై నిప్పులు చెరిగారు. కాగా, పరీక్ష వాయిదాకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రోశయ్యపై తిరుపతిలోని ఎస్వీ విశ్వవిద్యాలయం విద్యార్థులు వ్యతిరేక నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఎస్‌ఐ రాతపరీక్షల వాయిదాను నిరసిస్తూ గుంటూరు జిల్లాలో విద్యాసంస్థల బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.

సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాసకు తెలుగు విద్యార్థి, తెలుగు యువత మద్దతు ప్రకటించాయి. నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థులు విశ్వవిద్యాలయం వద్ద ఇతర చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కేవలం ఒక ప్రాంత విద్యార్థుల ఆందోళనకు తలవంచి ప్రభుత్వం పరీక్షలను వాయిదావేస్తే మున్ముందు ఏ నియామకాలను చేపట్టే అవకాశం ఉండదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య రేపటి విజయవాడ పర్యటనను అడ్డుకుంటామని సమైక్యాంధ్ర రాజకీయ జెఎసి నేతలు శామ్యూల్, నరసింహారావు చెప్పారు.

ఎస్‌ఐ రాతపరీక్షల వాయిదాను నిరసిస్తూ ఐక్య కార్యాచరణ సమితి విద్యార్థులు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునివ్వటంతో విశాఖలో విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. పలు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. మరికొన్ని చోట్ల విద్యార్థినాయకులే వెళ్లి మూయించారు. ప్రభుత్వం ఏకపక్షంగా ఎస్‌ఐ రాత పరీక్షలను వాయిదావేసినందుకు నిరసనగా ఆంధ్ర యూనివర్శిటీలో విద్యార్థులు ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. సీమాంధ్రపరిధిలోని 14 యూనివర్శిటీల్లో దీక్షలు చేపడతారని సమైక్యాంధ్ర జేఏసీ నేతలు ఈ సందర్భంగా తెలిపారు. షెడ్యూలుప్రకారం ఎస్‌ఐ రాతపరీక్షలు నిర్వహించకుంటే నిరసనలు కొనసాగుతాయని సీమాంధ్రలోని అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస పిలుపుమేరకు ప్రకాశం జిల్లాలో విద్యాసంస్థలన్నింటిని మూసివేశారు. ఒంగోలు, చీరాల, కందుకూరు. మార్కాపురం... తదితరప్రాంతాల్లో విద్యార్థులు భారీ ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఎస్సై పరీక్షలు వెంటనే నిర్వహించాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఐకాస నేతలు విమర్శించారు. కొద్దిమంది ఆందోళనకు తలొగ్గి ఎస్సై పరీక్షను రద్దు చేయడం తగదని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నాయకులు అన్నారు. ఎస్సై పరీక్షలు వెంటనే నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ వారు రైల్‌రోకో నిర్వహించారు. తిరుపతి వెళుతున్న ప్యాసింజర్‌రైలును వారు అడ్డుకున్నారు. పట్టాలపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. చివరకు పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ప్రభుత్వం వెంటనే షెడ్యూలు ప్రకారం పరీక్షలు నిర్వహించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని విద్యార్థినేతలు హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X