హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొంత మందికి ఊహించని శాఖలు: తొలిసారే పంట పండింది

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
హైదరాబాద్‌: శాఖల కేటాయింపుల విషయంలో కొంత మంది మంత్రుల పంట పండింది. మంత్రి పదవి దక్కడమే గొప్ప అనుకుంటున్న కొంత మందికి ప్రదాన శాఖలు దక్కాయి. ప్రకాశం జిల్లాకు చెందిన మహీధర్‌రెడ్డికి కీలకమైన మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ దక్కింది. కాంగ్రెస్‌ నుంచి జగన్‌ నిష్క్రమించిన నేపథ్యంలో మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న వై.ఎస్‌.వివేకానందరెడ్డికి వ్యవసాయశాఖ లభించింది. వైఎస్‌ కుటుంబానికి మంచి పదవి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సుదర్శరెడ్డికి భారీ, మధ్య తరహా నీటి పారుదల శాఖను కేటాయించారు. గతంలో జరిగిన వ్యవహారాల వల్ల చెడ్డపేరు వచ్చినందున మంచినేతగా పేరున్న సుదర్శనరెడ్డికి ఈ పదవి కేటాయించారని భావిస్తున్నారు. వైద్య విద్యశాఖ మంత్రిగా పని చేసిన సుదర్శనరెడ్డికి ఇది భారీ పదోన్నతే.

2004 నుంచి వైద్య, ఆరోగ్యశాఖను వైద్యం, ఆరోగ్యశ్రీ, వైద్యవిద్యల పేరుతో మూడు ముక్కలు చేసి ముగ్గురికి కేటాయించగా ఇప్పుడు మూడింటిని కలిపి డి.ఎల్‌.రవీంద్రారెడ్డికి అప్పగించారు. 1989లో ఈయన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం కడప జిల్లాకున్న రాజకీయ ప్రాధాన్యం దృష్ట్యా కడప జిల్లాకు రెండు కీలక శాఖలు లభించాయి. మున్సిపల్‌ పరిపాలనా శాఖ మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణరెడ్డికి, వ్యవసాయ మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డికి అత్యంత కీలకమైన ఆర్థిక, రెవిన్యూ శాఖలు లభించాయి. రఘువీరారెడ్డి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడ్డారు. మోపిదేవి వెంకటరమణకు ఎక్సైజ్‌ శాఖ లభించింది. ఇటీవలివరకు ఆరోగ్యశ్రీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పితాని సత్యనారాయణకి కీలకమైన, అత్యధిక బడ్జెట్‌ కలిగిన సాంఘిక, సంక్షేమ శాఖను కేటాయించారు.

కొత్తగా మంత్రివర్గంలో చేరిన బస్వరాజు సారయ్యకి మరో కీలక ప్రాధాన్యమున్న బీసీ సంక్షేమ శాఖ లభించింది. గతంలో చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సునీతా లక్ష్మారెడ్డికి మెరుగైన మహిళా, శిశుసంక్షేమం లభించింది. దీంతోపాటు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చే స్వయం సహాయక సంఘాల వ్యవహారాలు చూసే ఇందిర క్రాంతిపథం(ఐకేపీ) సైతం ఆమెకే కేటాయించారు. ఐకేపీ గతంలో గ్రామీణాభివృద్ధి శాఖలో భాగంగా ఉండేది. సీనియర్‌ మంత్రి జానారెడ్డికి గ్రామీణ నీటి సరఫరాతో కూడిన పంచాయతీరాజ్‌ శాఖ దక్కింది. గతంలో గ్రామీణ నీటి సరఫరాకు వేరే మంత్రి ఉండేవారు. సబితకు మళ్ళీ హోం శాఖ దక్కించుకుని పట్టు నిలుపుకున్నారు. సీఎంకు సన్నిహితంగా ఉండే శ్రీధర్‌బాబుకు పౌర సరఫరాల శాఖతోపాటు శాసనసభా వ్యవహారాల శాఖనూ కేటాయించారు. ఉప ముఖ్యమంత్రి హోదా లభిస్తుందనే ప్రచారం లభించిన దామోదర్‌ రాజనర్సింహకి ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలు లభించాయి. గతంలో ఇవి రెండూ వేర్వేరుగా ఇద్దరు మంత్రులు పర్యవేక్షించారు.

ఉప ముఖ్యమంత్రి స్థాయికి తగినట్లు ఉండాలన్న ఉద్దేశంతో రెండింటినీ కలిపినట్లు కనిపిస్తోంది. సీనియర్‌ మంత్రి గీతారెడ్డి కీలకమైన భారీ పరిశ్రమలతోపాటు చక్కెరశాఖ దక్కింది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన శైలజానాథ్‌కి సైతం ప్రాథమిక విద్యశాఖతో కొంతమేర ప్రాధాన్యం లభించింది. గతంలో మంత్రులుగా వ్యవహరించి, ఇప్పుడూ స్థానాలు నిలబెట్టుకున్న మంత్రుల్లో కొందరికి పాత శాఖలే లభించాయి. ఈ జాబితాలో సబితా ఇంద్రారెడ్డి, బాలరాజు, అహ్మదుల్లా తదితరులున్నారు. వీరిలో అహ్మదుల్లాకి గతంలో మైనారిటీ సంక్షేమ శాఖతోపాటు విద్యకు సంబంధించిన ఒక విభాగమూ ఉండేది. ప్రస్తుతం మైనారిటీ వ్యవహారాలకే పరిమితం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X