గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ కుటుంబ సభ్యులు దోచుకు తిన్నారు: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
గుంటూరు: వైయస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆ దోచుకున్న డబ్బులతో పత్రికలు పెట్టారని, పవర్ ప్రాజెక్టులు పెట్టారని, సంస్థలను నెలకొల్పారని, పెద్ద భవంతులు కట్టుకున్నారని ఆయన అన్నారు. తనకు ఎవరి మీదా కోపం లేదని, ప్రజలకు దక్కాల్సిన సంపద వారు దోచుకున్నారని, తన బాధ అని ఆయన అన్నారు.

అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని, ఆ డబ్బులు పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టే వరకు ముందుకు పోతామని ఆయన అన్నారు. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పు వల్ల నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. రైతులకు సహాయం తేవడానికి చేత కాకపోతే కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు అందించిన సాయం కూడా మన రాష్ట్రానికి అందించలేదని ఆయన అన్నారు.

రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను వారి కర్మకు వదిలేశారని ఆయన విమర్శించారు. గుంటూరులో రైతు కోసం పేరుతో జరిగిన బహిరంగ సభలో ఆయన గురువారం సాయంత్రం ప్రసంగించారు. విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని తాము అసెంబ్లీలో కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు నిరాహార దీక్షకు దిగితే 24 గంటల్లో కేసులు ఎత్తేసిందని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు నిరాహార దీక్ష చేసి రైతు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని, దానికి సంబంధించిన క్రెడిట్ తీసుకోవాలని ఆయన సూచించారు. అసెంబ్లీలో తాము పోరాడినా రైతు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదని ఆయన విమర్శించారు. రైతులపై జాతీయ స్థాయి పోరాటానికి గుంటూరు సభ నాంది అని ఆయన అన్నారు. తామంతా జాతీయ స్థాయిలో రైతు సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. రైతు కష్టాలు చూస్తే కన్నీళ్లు వచ్చాయని ఆయన అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. నిరుడు వచ్చిన కృష్ణా వరదల వల్ల నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు సాయం అందించలేదని ఆయన అన్నారు.

పంట నష్టపోయి ఒక్క నేలలోనే 400 మంది రైతులు మరణించారని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన సాయం తడిసిన ధాన్యాన్ని బయటకు తేవడానికి కూడా సరిపోదని ఆయన అన్నారు. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం కరగలేదని ఆయన అన్నారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడం వల్లనే తాను నిరాహార దీక్షకు దిగానని ఆయన చెప్పారు. స్వామినాథన్ కమిటీ నివేదికను అమలు చేయాలని తాము కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.

చేనేత కార్మికుల పరిస్థితి చూస్తే గండె తరుక్కుపోతోందని ఆయన అన్నారు. వారికి పని కూడా లేదని, కడుపు నిండా తినే పరిస్థితి లేదని ఆయన అన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఉల్లిపాయలు యాభై రూపాయలు కిలో పలుకుతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం ఉందా, లేదా అనే పరిస్థితి నెలకొని ఉందని ఆయన అన్నారు.

చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వద్ద డబ్బులున్నాయని, మనకు ఇవ్వాలంటే ప్రభుత్వాలకు మనసు రావడం లేదని ఆయన అన్నారు. స్పెక్ట్రమ్ కుంభకోణంలో దోచి పెట్టింది లక్షా 70 వేల కోట్ల రూపాయలని, రైతులకు అడిగింది ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమేనని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X