హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్రమంగా దీమా కోల్పోతున్నట్లు కనిపిస్తున్నారు. క్రమంగా ఆయనలో విశ్వాసం సన్నగిల్లుతున్నట్లు అనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఆయనలో ఎంతో విశ్వాసం వ్యక్తమైంది. సమస్యలను తాను దీమాతో ఎదుర్కోగలననే ధైర్యం కనిపించింది. ఆయన వ్యవహారశైలి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది. అయితే, క్రమంగా ఆయనలో ఆత్మవిశ్వాసం కోల్పోతున్న సూచనలు బయటపడుతున్నాయి. పాత సమస్యలు తీవ్రమవుతుండగా, కొత్త సమస్యలు ఆయనను చుట్టుముడుతున్నాయి.

వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులను కట్టడి చేయడంలో ఆయన తీవ్రంగా విఫలమయ్యారు. ఆళ్ల నాని వంటి శాసనసభ్యులు మొదట ఆయన మాట వింటున్నట్లు కనిపించారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి సర్గుబాటు మాటలు తాత్కాలికంగా మాత్రమే పనిచేశాయని వైయస్ జగన్ జలదీక్ష రుజువు చేసింది. వైయస్ జగన్ వెంట శాసనసభ్యులు వెళ్తున్న తీరుపై ఆయన అధిష్టానానికి నివేదించినట్లు తెలుస్తోంది. దాన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యతను అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిపైనే పెట్టిందని అంటున్నారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తెలంగాణ ఆందోళన ఆయనకు తలనొప్పిగానే మారింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక విషయంలో తాను చేయాల్సింది ఏమీ లేకపోయినప్పటికీ శాంతిభద్రతల సమస్య ఆయనను వేధిస్తూనే ఉన్నది. తెలంగాణ ఉద్యమాన్ని కట్టడి చేయడంలో ఆయన ఫలితం సాధించలేదనే చెప్పాలి. అదే సమయంలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, నాయకులు ప్రతి రోజూ ఏదో కార్యక్రమం చేపట్టడం ఆందోళన కలిగించే విషయంగానే మారింది.

తాజాగా, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు కిరణ్ కుమార్ రెడ్డికి కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నాయి. దానిపై అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సిన అనివార్యతలో ముఖ్యమంత్రి పడ్డారు. కాగా, సొంత జిల్లా చిత్తూరులో అసమ్మతి ఆయనను ఇరకాటంలో పెడుతోంది. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న కిరణ్ కుమార్ రెడ్డిలో ఆత్మవిశ్వాసం నశిస్తోందనే మాట వినిపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X