హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులపై హైకోర్టులో మరో పిల్ దాఖలైంది. దీనిపై స్పందించి కోర్టు బుధవారం జగన్‌కు నోటీసులు పంపింది. జగన్‌తో పాటు మరి కొందరికి నోటీసులు జారీ చేసింది. కడప జిల్లాకు చెందిన న్యాయవాది కెకె శెర్వాణి వేసిన పిల్‌ను పరిశీలించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, కాగ్, సెబి చైర్మన్, సిఇసి, సిబిఐ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎసిబి, భారతి సిమెంట్స్, నిమ్మగడ్డ ప్రసాద్, జగతి పబ్లికేషన్స్‌లకు కూడా నోటీసులు జారీచేయాల్సిందిగా ఆదేశించింది.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు జగన్ ప్రజల ఆస్తులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని కంపెనీలకు ధారాదత్తం చేశాయని తద్వారా రూ.వందల కోట్ల పెట్టుబడులు తమ సంస్థల్లో పెట్టించుకున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. సెజ్, మైనింగ్ లీజు, ఇతర ప్రాజెక్టులు ఇష్టారాజ్యంగా కేటాయించారన్నారు. నష్టం ప్రకటించిన జగతి పబ్లికేషన్స్ కంపెనీలో రూ.10 ముఖ విలువగల షేరుకు రూ.350 ప్రీమియంతో పెట్టుబడి పెట్టించారని ఆరోపించారు. ఈ అభియోగాలు రుజువైతే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయకుండా డిబార్ చేసేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరారు.