ఆజాద్‌కు తెలంగాణ కాంగ్రెసు ఎంపిల అల్టిమేటం, రాజీనామాలకు రెడీ

తెలంగాణపై ప్రకటన చేయకపోతే తాము రాజీనామాలు చేస్తామని, రాజకీయాల నుంచి తప్పుకుంటామని తెలంగాణ ఎంపీలు హెచ్చరించారు. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయం అంశాలపై తెలంగాణ ఎంపీలు విరుచుకుపడ్డారు. అందులో రెచ్చగొట్టే విషయాలున్నాయని వారన్నారు. గులాం నబీ ఆజాద్‌తో సమావేశం తర్వాత పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ గౌడ్, సర్వే సత్యనారాయణ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు క్రెడిట్ పోతుందని, రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెసు ఓడిపోతుందనే వాదనను సర్వే సత్యనారాయణ ఖండించారు.
తెలంగాణ ఇస్తే తెరాస విలీనానికి తాము కూడా ప్రయత్నాలు చేస్తామని, కెసిఆర్‌ను ఒప్పించడానికి కృషి చేస్తామని తాము ఆజాద్‌తో చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఇస్తే ఈ ప్రాంతంలో కనీసం కాంగ్రెసుకు 15 సీట్లు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో పార్టీకి ఏ విధమైన నష్టం జరగదని ఆయన అన్నారు.