కడప జిల్లాలో రూ. 55 లక్షలు పట్టివేత, ఎమ్మెల్యేదిగా అనుమానం
Districts
oi-Pratapreddy
By Pratap
|
కడప: కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడిగా పంపిణీ కావడానికి రంగం సిద్ధమవుతోంది. సోమవారం రూ. 27.90 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు తాజాగా ఈరోజు రూ.55 లక్షల నగదు పట్టుకున్నారు. కడప జిల్లా గోపవరం మండలం పీపీకుంట చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో ఈ నగదు బయటపడింది. పెద్ద మొత్తంలో ఈ నగదును నెల్లూరు జిల్లా పొదలకూరు నుంచి మైదుకూరుకు తరలిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
కారులో ఆ డబ్బును తరలిస్తున్న పొదలకూరు వాసి ప్రభాకర్‌రెడ్డి సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ డబ్బు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ శాసనసభ్యుడిదని అనుమానిస్తున్నారు. కారును బట్టి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కాగా, కడప జిల్లా రెడ్డివారిపల్లె చెక్ పోస్టు వద్ద పోలీసు తనిఖీల్లో మరో 8.5 లక్షల రూపాయలు బయటపడ్డాయి.