వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్చరికలతో అధిష్టానానికి, సిఎంకు ముచ్చెమటలు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధుల రాజీనామాల హెచ్చరికలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టిస్తున్నట్టగానే కనిపిస్తోంది. ఇన్నాళ్లుగా టి-కాంగ్రెసుకు రాజీనామాలు చేసే ధైర్యం లేదని భావించిన అధిష్టానానికి షాక్ ఇస్తూ వారు రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం ఉదయం 11 గంటల లోపు అధిష్టానం నుండి స్పష్టమైన హామీ రాకపోతే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ తమ రాజీనామాలు నేరుగా సభాపతికే ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. తెలంగాణ ప్రాంతం నుండి ఎంపీలు రాజీనామా చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం పడదు. అయితే సుమారు 50 మంది శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతం నుండి ఉన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

టి-కాంగ్రెసు హెచ్చరికల నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందనే అనే ఆందోళన రాష్ట్ర, జాతీయ పార్టీలో ప్రారంభమయింది. అందుకే వారు టి-కాంగ్రెసును బుజ్జగించడానికి మూడు రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా ఫలితం లేక పోయింది. కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, చివరకు ముఖ్యమంత్రి సైతం రంగంలోకి దిగి బుజ్జగించారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు. తమ రాజీనామాలపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని టి-ఎమ్మెల్యేలు సిఎంకు, పిసిసి చీఫ్ వద్ద కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే పలువురు ఎంపీలు సోమవారం ఉదయం రాజీనామాలు లోక్ సభ సభాపతికి సమర్పించడానికి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్‌తో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నప్పటికి అనివార్య కారణాల వల్ల ఆ భేటీ రద్దయింది.

ఇప్పటికిప్పుడు తెలంగాణపై నిర్ణయం తీసుకునే పరిస్థితి అధిష్టానానికి లేదు. సీమాంధ్రులు ఎప్పటికప్పుడు అధిష్టానానికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ వారిని సముదాయించుతామని అనుకున్నప్పటికీ యుపిఏలోని మమతాబెనర్జీ వంటి వారు యుపిఏకు హెచ్చరికలు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో సీమాంధ్రుల హెచ్చరికలు కాకుండా జాతీయస్థాయిలో తెలంగాణ ప్రభావాన్ని కేంద్రం యోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే తెలంగాణపై స్పష్టమైన వైఖరిని నాన్చుతూ వస్తోంది. కానీ టి-కాంగ్రెసు నేతలు ఖచ్చితమైన నిర్ణయం కావాల్సిందే లేదా రాజీనామాలు ఆమోదించాలనే ఆల్టిమేటం జారీ చేయడంతో అధిష్టానం నోటిలో పచ్చి వెలక్కాయ పడింది. ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ రగడ తనను ఏం చేస్తుందో అనే బెంగ పట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.

అందుకే ఆయన ఆదివారం బుజ్జగింపులకే తన సమయాన్ని కేటాయించడం కాకుండా తెలంగాణలో తనకు సన్నిహితులైన పలువురిని రంగంలోకి దింపి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అయితే టి-కాంగ్రెసు నేతల రాజీనామాలు సాధ్యమైనంత వరకు తగ్గించాలని సిఎం, బొత్స, అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలా అయితే ప్రభుత్వానికి ఎలాంటి నష్టం ఉండదని భావిస్తోంది. ఉన్న వారిలో ఖచ్చితంగా చేయాలని నిర్ణయించుకున్న వారిని మినహాయించి రాజీనామాల సమయం వరకైనా మరికొందరిని బుజ్జగించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం అధిష్టానం, సిఎం, పిసిసి చీఫ్ తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కాగా మంత్రి దానం నాగేందర్ నగర పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేయరని ప్రకటించారు. తాను కూడా రాజీనామా చేయడం లేదన్నారు. రాజీనామాకు, తెలంగాణకు సంబంధం లేదన్నారు. తెలంగాణ విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. త్వరలో ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిసి విన్నవించుకుంటామని చెప్పారు. అధిష్టానం ఎలా చెబితే అలా నడుచుకుంటామని చెప్పారు. మంత్రి టిజి వెంకటేష్ టి-నేతల రాజీనామాపై స్పందిస్తూ 164 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన వచ్చినప్పటికీ కాంగ్రెసు ప్రభుత్వం కొనసాగుతుందని కొత్త ప్రతిపాదన తీసుకు వచ్చారు.

English summary
Congress high command and CM Kiran Kumar Reddy is in very crisis with T-congress leaders resignations warning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X