వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపిఐఐసిలో అక్రమాలు: ఇరుక్కుంటున్న బిపి ఆచార్య?

By Srinivas
|
Google Oneindia TeluguNews

apiic
హైదరాబాద్: ప్రస్తుత హోం శాఖ ముఖ్య కార్యదర్శి, మాజీ ఎపిఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ భూముల విషయంలో ముందు వచ్చిన వారికి ముందు కేటాయించకుండా తర్వాత వచ్చిన వారికి అతి తక్కువ ధరకే కేటాయించినట్లు సిబిఐ విచారణలో బయటపడుతున్నట్లుగా తెలుస్తోంది. జగన్ అక్రమాస్తులపై విచారణ జరుపుతున్న సిబిఐ అధికారులు వరుసగా రెండోసారి ఆయనను విచారించారు. ఇప్పటి వరకు జగన్ కంపెనీలు, వాటిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలపై దృష్టిసారించిన సిబిఐ.. తాజాగా వారిలో అత్యధికులు ఎపిఐఐసి నుంచి లబ్ది పొందినవారే కావడంతో అప్పట్లో ఎపిఐఐసిలో పని చేసిన బిపి ఆచార్య, గనుల శాఖలో పని చేసిన రాజగోపాల్, మహిళా ఐఏఎస్ శ్రీలక్ష్మి, గనుల శాఖలో డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లుగా పని చేసిన వారిని ఇప్పటికే ఒకసారి విచారించారు. ముఖ్యంగా కొన్ని కంపెనీలకు ప్రభుత్వ భూములను ఏవిధంగా అప్పగించారు? భూముల అప్పగింత నిబంధనల ప్రకారమే జరిగిందా? మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన కేటాయించారా? భూముల కేటాయింపులకు అనుసరించిన ప్రాతిపదిక ఏమిటి? తదితర విషయాలను క్షుణ్ణంగా ఆరా తీశారు.

ఈ సందర్భంగా, జడ్చర్ల ఫార్మా సెజ్‌లో మొదట వచ్చిన వారికే మొదట ప్రాతిపదికన భూములను కేటాయించామని సిబిఐ అధికారులకు బిపి ఆచార్య చెప్పినట్లు తెలిసింది. అయితే, అనంతరం రికార్డులను పరిశీలించిన అధికారులు ఆచార్య ప్రకటనకు విరుద్ధంగా భూములను కేటాయించినట్లు గుర్తించారు. ఈ సమయంలోనే, అనూహ్యంగా లీ-ఫార్మా అనే కంపెనీ తెరపైకి వచ్చింది. జడ్చర్ల సెజ్‌లో పదెకరాల భూమిని కేటాయించాలంటూ 2006లోనే ఈ కంపెనీ ఎపిఐఐసికి దరఖాస్తు చేసుకుంది. కానీ, లీ-ఫార్మాకు కాకుండా ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న అరబిందో, హెటిరో కంపెనీలకు ఆచార్య భూములను కేటాయించారు. దీంతో, లీ-ఫార్మా కంపెనీ చైర్మన్, ఎండీలకు నోటీసులు జారీ చేసిన సిబిఐ అధికారులు శనివారంవారి వాంగ్మూలాలను కూడా రికార్డు చేశారు. కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన సమాచారం ప్రకారం జడ్చర్ల సెజ్‌లో భూమి కేటాయింపునకు సంబంధించి ఎపిఐఐసికి రెండోసారి నవంబర్ 20, 2006న దరఖాస్తు చేసుకున్నారు.

అంతకు ముందు నవంబర్ 13న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. ఆ తర్వాత, నవంబర్ 14న స్వయంగా అప్పటి ఎపిఐఐసి ఎండి ఆచార్యకు దరఖాస్తు సమర్పించారు. అయితే, ఆ సమయంలో భూములు కేటాయించడానికి ఎపిఐఐసి ముందుకు రాలేదు. ఏడాదిన్నర తర్వాత స్పందించిన ఎపిఐఐసి. జడ్చర్లలో భూమి కావాలంటే ఎకరాకు రూ.30 లక్షలు చెల్లించాలని లీ-ఫార్మాకు షరతు విధించింది. తొలుత ఎకరాకు రూ.30 లక్షలు చెల్లించాలని చెప్పినా ఆ తర్వాత ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించాలంటూ అధికారికంగానే లీ-ఫార్మకు స్పష్టం చేసింది. అది కూడా భూమిని పొజిషన్‌లోకి తీసుకోవడానికి ముందే మొత్తం డబ్బు చెల్లించాలని ఎపిఐఐసి తేల్చి చెప్పింది. అంత ధర చెల్లించలేమని, కొంచెం తగ్గించాలంటూ లీ-ఫార్మా ఆచార్యను కోరినట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం నిర్ణయించిన ధరను తాను తగ్గించలేనని ఆచార్య బదులిచ్చారు. అదే సమయంలో, జడ్చర్ల సెజ్‌లోనే ఎకరా రూ.7 లక్షలకే అరబిందో, హెటిరో కంపెనీలకు ఎపిఐఐసి భూములు కేటాయించింది. ఈ మేరకు, లీ-ఫార్మా ఎండి ఇచ్చిన వాంగ్మూలాన్ని సిబిఐ అధికారులు రికార్డు చేసుకున్నారు. అనంతరం, బిపి ఆచార్యను మరోసారి దిల్‌కుశ్ అతిథి గృహానికి పిలిపించుకున్నారు.

ఈ సందర్భంగా, జడ్చర్ల ఫార్మా సెజ్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. లీ-ఫార్మా మొదట దరఖాస్తు చేసుకున్నా మొదట వచ్చిన వారికే మొదట ప్రాతిపదికన భూములు కేటాయించలేదన్న విషయాన్ని బయట పెట్టినట్లు తెలిసింది. లీ-ఫార్మాకు ఎకరా ధర రూ.30 లక్షలు చెప్పి హెటిరో, అరబిందోలకు రూ.7 లక్షలకే భూములను కేటాయించడంపైనా ప్రశ్నించినట్లు సమాచారం. శనివారం ఉదయం నుంచే పలు కంపెనీల ప్రతినిధులు సీబీఐ కార్యాలయానికి బారులు తీరారు. ఎమార్ ప్రాపర్టీస్‌తోపాటు ఎపిఐఐసి అధికారులు ఉదయాన్నే సిబిఐ కార్యాలయానికి వచ్చి డాక్యుమెంట్లను అందజేశారు. ఆ తర్వాత కొన్ని జాతీయ బ్యాంకుల ఉన్నతాధికారులు వచ్చారు. అనంతరం, ఆదాయ పన్ను శాఖకు చెందిన అధికారుల బృందం సిబిఐ కార్యాలయానికి వచ్చింది. తర్వాత బెంగళూరుకు చెందిన జూబ్లీ మీడియా ప్రతినిధి వచ్చారు. కొన్ని డాక్యుమెంట్లను సిబిఐ అధికారులకు ఇచ్చారు. అయితే, మరిన్ని వివరాలు కావాలని సిబిఐ అధికారులు కోరారు.

దీంతో, సాయంత్రానికే బెంగళూరు నుంచి మరికొన్ని డాక్యుమెంట్లను తీసుకుని వచ్చి సిబిఐ అధికారులకు అందజేశారు. అలాగే, జగన్ కంపెనీల్లో వ్యక్తిగత పెట్టుబడులు పెట్టిన ఏకే దండమూడి తన ఆదాయ వ్యయాలు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలను సిబిఐ అధికారులకు సమర్పించారు. కాగా, లార్స్‌కో కంపెనీ నుంచి లగడపాటి శ్రీధర్ సైతం సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సిబిఐ కార్యాలయానికి వచ్చిన శ్రీధర్ 4గంటలపాటు విచారణను ఎదుర్కొన్నారు. రాత్రికి 9 గంటలకు సిబిఐ కార్యాలయం నుంచి బయటికి వచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జగన్ కంపెనీల్లో తాము రూ.50 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టామని చెప్పారు. లాభాలు వస్తాయన్న ఆశతోనే పెట్టుబడులు పెట్టామన్నారు. తమ కంపెనీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలను సిబిఐ అధికారులు కోరారని, వాటన్నిటినీ అధికారులకు అందజేశామని తెలిపారు. ఇక, వీరితోపాటు సండూర్ పవర్, జగతి పబ్లికేషన్స్‌కు చెందిన కొందరు ప్రతినిధులు సిబిఐ కార్యాలయానికి వచ్చి కొన్ని డాక్యుమెంట్లు సమర్పించి వెళ్లారు.

English summary
IT seems, Foremer APIIC md BP Acharya in CBI chakrabandam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X