వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధిష్టానంపై ధ్వజమెత్తిన రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jupalli Krishna Rao, Rajaiah and Somarapu Satyanarayana
హైదరాబాద్: తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోవడంపై కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన ముగ్గురు శానససభ్యులు తీవ్రంగా ధ్వజమెత్తారు. పార్టీకి రాజీనామాలు చేసిన తర్వాత జూపల్లి కృష్ణారావు, రాజయ్య, సోమారపు సత్యనారాయణ ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం వెనక్కి పోవడం వల్ల ఆత్మబలిదానాలు జరిగాయని, దానికి మనస్తాపం చెంది పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు రాజయ్య చెప్పారు. పల్లెల్లో సోనియా దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారని ఆయన అన్నారు. పార్టీ జెండాలను పట్టుకుని తిరిగే పరిస్థితి లేదని ఆయన అన్నారు. నిర్ణయం తీసుకోకపోతే కఠినం నిర్ణయం తీసుకుంటామని చేసిన ప్రకటనకు కట్టుబడి తాము రాజీనామాలు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనేందుకు తాము రాజీనామాలు చేశామని ఆయన చెప్పారు. తెలంగాణ మంత్రులు గవర్నర్‌కు రాజీనామాలు సమర్పించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

ఉద్యమాన్ని అణచివేసేందుకు, తెలంగాణ నాయకులను ప్రలోభ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. పార్టీ అధిష్టానం వైఖరికి విసుగు చెంది రాజీనామాలు చేసినట్లు ఆయన తెలిపారు. రైల్ రోకోలో పాల్గొన్నందుకు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆయన అన్నారు. సకల జనుల సమ్మెకు విరామం ఇచ్చిన నేపథ్యంలో రాజకీయ ఉద్యమం ఉధృతం చేయాల్సిన బాధ్యతను తాము తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజాప్రతినిధులంటే కాంగ్రెసు అధిష్టానానికి ఏ మాత్రం గౌరవం లేదని ఆయన అన్నారు. చర్చల పేరుతో కాంగ్రెసు అధిష్టానం కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు.

స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను తెలంగాణ ఉద్యమకారులపై నేటి ప్రభుత్వం అనుసరిస్తోందని సోమారపు సత్యనారాయణ విమర్శించారు. అధికారం ముఖ్యం కాదని, తెలంగాణ సాధన ముఖ్యమని ఆయన అన్నారు. ఈ రోజు తెలంగాణ రాకపోతే మరెప్పుడూ రాదని ఆయన అన్నారు. అస్తిత్వాన్ని కాపాడుకుని ప్రజాప్రతినిధులు తెలంగాణ సాధనకు పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పనిచేస్తున్న చిన్న పార్టీలోకి వెళ్లడానికి కూడా తాము సిద్ధపడ్డామని ఆయన చెప్పారు. రాజీనామాలు చేయాలని ఆయన కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు సూచించారు. తాము పార్టీని వీడుతామని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పాలని ఆయన సూచించారు. కేవలం తెలంగాణ కోసం మాత్రమే కాంగ్రెసు పార్టీని వీడుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెసు మోసం చేస్తోందని ఆయన అన్నారు.

డబ్బులకు అమ్ముడుపోయి కొంత మంది తెలంగాణ నాయకులు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని, ఆ ద్రోహులతో ఉండలేక కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశామని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తరతరాల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని, ఐదు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా మాట ఇచ్చి కాంగ్రెసు అధిష్టానం నిలబెట్టుకోలేకపోయిందని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు రెండు గంటల్లో తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తే, తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ కర్తవ్యాన్ని నిర్వహించడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ప్రలోభాలకు లొంగనివారి పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆయన అన్నారు. శానససభా సభ్యత్వానికి చేసిన రాజీనామాలను స్పీకర్ తిరస్కరించినప్పుడు పార్టీలకు రాజీనామాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులు రాజీనామాలు చేస్తే ప్రభుత్వం పడిపోదని, కాంగ్రెసు అధిష్టానం దిగివస్తుందని ఆయన అన్నారు. పరీక్షలను కిరణ్ కుమార్ రెడ్డి వాయిదా వేయకపోతే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ తిన్నదని తెలంగాణ మంత్రులు ఎందుకు భావించడం లేదని ఆయన అడిగారు.

తన పాదయాత్రను అడ్డుకుంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, తాము ప్రలోభాలకు లొంగదలుచుకోలేదని జూపల్లి అన్నారు. రాజీనామా ఆయుధాన్ని తెలంగాణ కోసం ప్రయోగిస్తేనే ఫలితం ఉంటుందని ఆయన అన్నారు. గన్‌మెన్‌లను పార్లమెంటు సభ్యులు సరెండర్ చేస్తే ఎందుకు సరెండర్ చేశారని మాట్లాడే పరిస్థితి కూడా లేదని ఆయన అన్నారు. త్యాగాలు చేస్తామని చెప్పిన మంత్రులు, శాసనసభ్యులు మాట తప్పుతున్నారని ఆయన అన్నారు. పదవులు, అధికారం శాశ్వతం కాదని, తెలంగాణ కోసం త్యాగం చేస్తే ప్రజాప్రతినిధుల పరువు, పార్టీ పరువు దక్కుతుందని ఆయన అన్నారు. రాజీనామాలు చేయడానికి సిద్ధపడని తెలంగాణ మంత్రులపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజలు ఛీకొడితే అమెరికాలో ఉంటాం, ఢిల్లీ ఉంటామని అంటే సరిపోదని ఆయన అన్నారు. మంత్రులు రాజీనామా చేస్తే కేంద్రం దిగి వస్తుందని ఆయన అన్నారు. బాధతో కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశామని ఆయన చెప్పారు. తెలంగాణ రాకుండా సీమాంధ్ర నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసులో ఉంటూ తెలంగాణ సాధిస్తామంటే ప్రజలు నమ్మడం లేదని ఆయన అన్నారు. రాజీనామా చేయకుండా ఉండడానికి నెపాన్ని ఢిల్లీపైకి నెడుతున్నారని ఆయన అన్నారు. మనకు రోషం, దమ్ము లేక వచ్చిన తెలంగాణను నిలబెట్టుకోలేకపోయామని ఆయన అన్నారు. ప్రజలు తిరగబడక ముందే ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని ఆయన అన్నారు.

English summary
Resigned Congress MLAs Jupalli Krishna Rao, Somarapu Satyanarayana and Rajaiah lashed out at Congress high command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X