విజయవాడ/కడప: ఉద్యోగుల సమ్మె కారణంగా కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటి యాజమాన్యం విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. సెలవులు ప్రకటించి ఇంటికి వెళ్లమని చెప్పడంపై విద్యార్థులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమకు సెలవులు అవసరం లేదని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ గేటు ముందు ఆందోళనకు దిగారు. అక్కడే బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ 144వ సెక్షన్ విధించారు. పరిస్థితులు చేయి దాటకుండా పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
కాగా ఇటీవల ట్రిపుల్ ఐటి కొంతమంది సిబ్బందిని తొలగించింది. దీంతో సిబ్బంది సమ్మె చేస్తున్నారు. తొలగించిన సిబ్బందిని తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సిబ్బంది సమ్మె కారణంగా విద్యార్థులకు పాఠాలు చెప్పే వారు లేక పోవడంతో యాజమాన్యం సెలవులు ప్రకటించింది. సిబ్బందికి, యాజమాన్యానికి మధ్య జరుగుతున్న గొడవకు విద్యార్థులు బలి అవుతున్నారు. సిబ్బంది తొలగింపుపై బాసర, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటి విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్నారు.