గాలి కేసు: వారంపాటు సిబిఐ కస్టడీకి రాజగోపాల్

న్యాయవాది సమక్షంలోనే రాజగోపాల్‌ను ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. రాజగోపాల్ బంధువు ఒకతను ఒఎంసిలో పనిచేస్తున్నాడని, దాంతో రాజగోపాల్ ఒఎంసికి అనుకూలంగా పని చేశాడని, కింది స్థాయి ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసి ఒఎంసికి అనుకూలంగా వ్యవహరించాడని సిబిఐ ఆరోపించింది. తమ క్లయింట్‌ను సిబిఐ వేధిస్తోందని రాజగోపాల్ తరఫు న్యాయవాది ఆరోపించారు. రాజగోపాల్‌ను తమ కార్యాలయానికి పిలిపించి పలు మార్లు విచారించిందని, వాటిని రికార్డు కూడా చేయలేదని ఆయన అన్నారు.
కాగా, గాలి జనార్దన్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు తమకు అప్పగించాలని సిబిఐని ఆదేశించాలని ఆదాయం పన్ను శాఖ కోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. ఇదిలా వుంటే, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో స్టైలిష్ హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోనేరు ప్రసాద్‌కు ఈ నెల 18వ తేదీ వరకు జ్యుడిషిటల్ కస్టడీ విధిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ కస్టడీ ముగియడంతో సిబిఐ అధికారులు కోనేరు ప్రసాద్‌ను సోమవారం కోర్టులో హాజరు పరిచారు.