వరంగల్: తమ కోడిని కొట్టినందుకు ఆరేళ్ల బాలుడికి పొరుగుంటివారు విషమిచ్చారనే ఆరోపణలు వచ్చాయి. విషం కలిపిన అన్నం తినడంతో ఆ బాలుడు మరణించాడు. మూడు రోజుల క్రితం సాగర్ అనే ఆరేళ్ల బాలుడు పొరుగింటివారి కోడిని రాయితో కొట్టాడు. దాంతో పక్కన ఉండే నరేష్ అనే వ్యక్తి తమ కుమారుడికి విషమిచ్చాడని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండవతాపురం గ్రామంలో జరిగింది.
మూడు రోజుల క్రితం వర్ధన్నపేటలో చేరిన సాగర్ మంగళవారం మరణించాడు. విషం ఇవ్వడం వల్లనే బాలుడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు. బాలుడి తల్లిదండ్రులు అప్పటికే వర్ధన్నపేట పోలీసులకు నరేష్‌పై ఫిర్యాదు చేశారు. తమపై ఉన్న కక్షల కారణంగానే తమ కుమారుడిని విషమిచ్చి నరేష్ చంపాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే, నరేష్ మాత్రం వారి ఆరోపణలను ఖండిస్తున్నాడు.