హైదరాబాద్: తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగి కాంగ్రెసు పార్టీలోకి తిరిగి వెళ్లేది లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి ఆదివారం స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ జగన్‌తోనే ఉంటానని చెప్పారు. ఉప ఎన్నికలు వస్తే తాను నలభై వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. బళ్లారిలో గాలి ధాటికి కాంగ్రెసు తుడిచి పెట్టుకు పోయిందని ఆంధ్ర ప్రదేశ్‌లోనూ అదే జరుగుతుందన్నారు. పులివెందుల, కడప ఉప ఎన్నికల్లో ఎలా మెజార్టీ సాధించామో ఉప ఎన్నికలు వస్తే జగన్ పార్టీ అలా మెజార్టీ సాధిస్తుందన్నారు.
జగన్‌ను విడిచి ఒకరిద్దరు వెళ్లి పోయినా ఎలాంటి నష్టం లేదన్నారు. కాంగ్రెసులోకి వెళ్లి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు వమ్ము చేసే వాడిని కాదన్నారు. జగన్‌తో ఉంటానన్న నా ఆలోచనలో ఎలాంటి మార్పు లేదన్నారు. సమయం వచ్చింది కాబట్టే తాను ఇప్పుడు మీడియా ముందు చెబుతున్నానన్నారు. కాగా అంతకుముందు కాపు రామచంద్రా రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు.