హైదరాబాద్: తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణపై వెంటనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నారు. తెలంగాణపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. రిటైల్ రంగంలో ఎఫ్‌డిలకు నిరసనగా తాము దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. లోక్‌పాల్ నియామక అధికారం ప్రభుత్వం చేతుల్లోనే ఉందని, దీనికి తాము వ్యతిరేకమని, సభ్యులను తొలగించే అధికారం సుప్రీంకోర్టుకు ఉండాలని ఆయన అన్నారు. లోక్‌పాల్‌కు స్వతంత్ర విచారణ అధికారం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఐదు రాష్ట్రాలకు జరగునున్న శాసనసభ ఎన్నికల్లో తాము ఇతర చిన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తామని ఆయన చెప్పారు. పంజాబ్‌లో 9, ఉత్తరప్రదేశ్‌లో 18, ఉత్తరాఖండ్‌లో 6, మణిపూర్‌లో 2 స్థానాలకు పోటీ చేస్తామని ఆనయ చెప్పారు. ఆహార భద్రత బిల్లును తాము మార్పులు, చేర్పులు లేకుండా ఆమోదించామని ఆనయ చెప్పారు. 42 శాతం చిన్నారుల్లో పౌష్టికాహార లోపం ఉందని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పడం సిగ్గు చేటు అని ఆయన వ్యాఖ్యానించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి