జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, షెడ్యూల్ ఖరారు
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యుల అనర్హత వేటు విచారణ బుధవారం నుండి ప్రారంభం కానుంది. 18న పిఆర్పీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి, కాంగ్రెసు ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముందు హాజరు కానున్నారు. 19న అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కొండా సురేఖ, కృష్ణదాసు, బాబురావు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, 20న గుర్నాథ్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, సుచరిత, పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రసాదరాజు, 21న శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, తెల్లం బాబూరావులు స్పీకర్ ఎదుట హాజరు కానున్నారు. ఈ మేరకు స్పీకర్ షెడ్యూల్ ఖరారు చేశారు. కాగా రెండోసారి స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వారు బుధవారం నుండి వరుసగా హాజరై సమాధానం ఇవ్వనున్నారు.
గత డిసెంబర్‌లో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్ ధిక్కరించిన పదిహేడు మంది ఎమ్మెల్యేలకు సభ్యత్వాలపై రేపటి నుండి జరిగేదే దాదాపు తుది విచారణ. సభ్యత్వ రద్దు ఫిర్యాదులపై సభాపతి నోటీసులు ఇవ్వగా విప్‌ను ధిక్కరించిన వారు వివరణ ఇచ్చారు. ఆ వివరాల ఆధారంగా 18-21 మధ్య స్పీకర్‌తో నేరుగా మాట్లాడనున్నారు. అనంతరం అనర్హత పిటిషన్‌పై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. కాగా అనర్హత పిటిషన్‌కు ముందే తాను పదవికి రాజీనామా చేశానని శోభా నాగిరెడ్డి చెబుతుండగా, తనకు విప్ అందలేదని కాపు రామచంద్రా రెడ్డి చెబుతున్నారు.