పదిహేను రోజుల్లో పదవి వదిలేస్తా: జగన్ ఎమ్మెల్యే కాపు
Districts
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: కొన్ని రాజకీయ కారణాల వల్ల శాసనసభ్యత్వం నుండి తాను మరో పదిహేను రోజుల్లో వైదొలగనున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి గురువారం వెల్లడించారు. రాయదుర్గంలోని స్థానిక కెటిఎస్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ సభలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. తనకు శాసనసభ్యుడి హోదాలో బహుశా ఇదే చివరి కార్యక్రమం కావచ్చునన్నారు. ఇప్పటికే తాను తన పదవికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. పదిహేను రోజుల తర్వాత ఎమ్మెల్యేగా కాకుండా సాధారణ వ్యక్తిగా సేవ చేస్తానని చెప్పారు. తన ఆస్తి వివరాలు ఎవరైనా సమాచార హక్కు, చట్టం ద్వారా పొందవచ్చునని తెలిపారు.
కొన్ని అనివార్య కారణాల వల్ల అభివృద్ధి పనులు చేపట్టలేక పోవడంపై బాధ కలుగుతోందన్నారు. ప్రజలకు తాను చేతనైన సాయం చేశానని, కానీ విజయవంతమైన ఎమ్మెల్యేను కాలేక పోయానన్నారు. నియోజకవర్గంలో అతి తక్కువ కాలం ఎమ్మెల్యే హోదాలో కొనసాగిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతానన్నారు. నన్ను మీవాడిగా ఆదరిస్తారని భావిస్తున్నానని అన్నారు. కాగా ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో పార్టీ విప్ ధిక్కరించి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. అయితే తనకు ఎలాంటి విప్ అందలేదని ఆయన ఆ తర్వాత చెప్పారు.