హాజరు కాను: స్పీకర్‌కు మళ్లీ జగన్‌వర్గం ఎమ్మెల్యే లేఖ
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: తాను విచారణకు హాజరు కానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రా రెడ్డి సోమవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు మరోసారి లేఖ రాశారు. గతంలో విచారణకు హాజరు కాకపోవడంతో స్పీకర్ ఫిబ్రవరి రెండో తేదిన హాజరు కావాలని నోటీసులు పంపించారు. ఇందుకు ఆయన సోమవారం తాను హాజరు కాబోనని చెబుతూ స్పీకర్‌కు లేఖ రాశారు. సిఎల్పీ చేసిన ఫిర్యాదులు, ప్రభుత్వం విప్ జారీ చేసిన నోటీసులు, సర్టిఫైడ్ కాపీలు తనకు పంపమని కోరినప్పటికీ ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు. సిఎల్పీ లేఖ తనకు అందలేదని చెప్పారు. కాబట్టి తాను హాజరు కానన్నారు.
కాగా గత సంవత్సరం డిసెంబర్లో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసానికి పార్టీ విప్ ధిక్కరించి ఓటు వేసిన వారిలో కాపు రామచంద్రా రెడ్డి ఒకరు. పార్టీ విప్ ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు వివరణ అడగ్గా, తనకు పార్టీ విప్ అందలేదని ఆయన గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల 18వ తారీఖున ఆయన స్పీకర్ ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన హాజరు కాలేదు.