హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యువతకు గాలం వేసే పనిలో పడ్డట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు రైతు పోరు యాత్రలు చేపట్టిన బాబు తన దృష్టి యువతపై కేంద్రీకరించారు. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పట్టణాల్లో యువజన సదస్సులు ఏర్పాటు చేసేందుకు టిడిపి నిర్ణయించింది. ఈ నెల 8 నుండి 11వ తేది వరకు వరుసగా నాలుగు రోజులు తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లలో సదస్సులు నిర్వహించేందుకు బాబు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. యువత రాజకీయాలను అసహ్యించుకునే పరిస్థితి రాకూడదన్నారు. యువతకు నాయకత్వ లక్షణాలు అవసరమని ఆయన అన్నారు. అవినీతిరహిత పాలన ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ అవినీతికి మద్దతిస్తోందన్నారు. అవినీతి, అసమర్థ పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి వెనక్కి పోయిందన్నారు. ప్రభుత్వ పాలన ఇలాగే ఉంటే టెట్, జుడాల సమస్యలు తలెత్తుతాయన్నారు.
అవినీతి రాజకీయ నాయకులను చూసి యువతకు రాజకీయాలంటేనే నమ్మకం పోయే పరిస్థితి వచ్చిందన్నారు. దానిని మార్చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అవినీతిరహిత సమాజం కావాలంటే పటిష్ట లోక్ పాల్ బిల్లును తీసుకు రావాలని అన్నారు. అవినీతి ప్రక్షాళన జరగాల్సిందేనన్నారు. కాగా ఇటీవల హీరో నందమూరి బాలకృష్ణ పర్యటనలు టిడిపి క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు, యువతను బాగానే ఆకర్షించింది.