హైదరాబాద్: అనంతపురం జిల్లాలో బళ్లారి పాలిటిక్స్ ప్లే కానున్నాయని అంటున్నారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడిన విషయం తెలిసిందే. అందులో రాయదుర్గం ఒకటి. రాయదుర్గం నుంటి కాపు రామచంద్రా రెడ్డి నిన్నటి వరకు ప్రాతినిథ్యం వహించారు. అయితే వచ్చే ఉప ఎన్నికలలో జగన్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు కాపు సంసిద్ధంగా లేరని తెలుస్తోంది. నియోజకవర్గంలో తనపై ఉన్న వ్యతిరేకత తదితర కారణాల వల్ల ఆయన పోటీకి వెనుకడుగు వేస్తున్నారని అంటున్నారు. అయితే ఆయన స్థానంలో ఓ బిసి నేతను రంగంలోకి దింపేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్కు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే.
కాపు సిద్ధంగా లేరు కాబట్టి రాయదుర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున మరో బలమైన అభ్యర్థిని దింపే యోచనలో గాలి ముఖ్య అనుచరుడు, ఇటీవలె కర్నాటకలో బిఎస్సార్ పార్టీ స్థాపించిన శ్రీరాములు ఉన్నట్లుగా తెలుస్తోంది. రాయదుర్గంలో అభ్యర్థి వ్యవహారం శ్రీరాములు నడిపిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే కర్నాటకలో కొత్తగా స్థాపించిన బిఎస్సార్ మంచి ఊపుమీద ఉంది. అదే ఊపుతో పక్కనే ఉన్న అనంతలోనూ పట్టున్న మంచి బిసి అభ్యర్థిని రంగంలోకి దింపి జగన్కు అండగా నిలబడాలని చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీరాములు బోయ కులానికి చెందిన వారు. అనంతలో బోయ కులం ఓట్లు చాలా ఉన్నాయి. దానిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారట. అందులో భాగంగా కర్నాటక ఎంపి పకీరప్ప బంధువును రంగంలోకి దింపనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.