పార్టీలు మారే నీ చరిత్ర తెలుసు?: రామజోగయ్యపై వట్టి
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత హరిరామజోగయ్యపై మంత్రి వట్టి వసంత్ కుమార్ ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నలభై ఏళ్లుగా హరిరామజోగయ్య చరిత్ర అందరికీ తెలుసునని విమర్సించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు మారిన చరిత్ర ఆయనది అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, సిపిఎం తప్ప మిగిలిన అన్ని పార్టీలు మారారని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీలో పదవులు అనుభవించి వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. సొంత కొడుకు చేతనే విమర్శలు ఎదుర్కొన్నారని వట్టి విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని తిట్టి ఇప్పుడు ఆయన తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడమేమిటని ప్రశ్నించారు.
కాగా హరిరామజోగయ్య ఏప్రిల్ మూడో తేదిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జగన్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నారు. రెండు రోజుల క్రితం హరిరామజోగయ్య రాజ్యసభ సభ్యుడు చిరంజీవిపై విమర్శలు గుప్పించగా, చిరు వర్గం మంత్రి గంటా శ్రీనివాస రావు ఆయనకు కౌంటర్ వేశారు.