వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌తో వంశీ భేటీ: వెనక జూనియర్ ఎన్టీఆర్ 'దమ్ము'?

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr NTR
హైదరాబాద్: విజయవాడలోని నడిరోడ్డుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో తెలుగుదేశం పార్టీ నగర అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ భేటీ కావడం యాదృచ్ఛికమేమీ కాదనే ప్రచారం జరుగుతోంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే వంశీ జగన్‌ను కలిశారని అంటున్నారు. అయితే, దీని వెనక తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ తనయుడు, సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేయడమే కాకుండా, చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.

ప్రణాళిక జూనియర్ ఎన్టీఆర్ కాగా, దాన్ని అమలు చేసింది వల్లభనేని వంశీ అని అంటున్నారు. కృష్ణా జిల్లాలోని తన వర్గాన్ని వైయస్ జగన్ నాయకత్వంలోకి పంపించడానికి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఆ రకమైన సంకేతాలు ఇవ్వడానికే వంశీ బహిరంగంగా జగన్‌ను కలిసినట్లు చెబుతున్నారు. జగన్‌తో వంశీ కలయిక యాదృచ్ఛికం కాదని భావించడం వల్లనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీరియస్ కావడం, వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగిపోయాయని అంటున్నారు.

చంద్రబాబు నాయుడికి, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య తలెత్తిన వివాదాలే తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెడుతున్నట్లు భావిస్తున్నారు. చంద్రబాబుకు సన్నిహితుడైన కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు, శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు హవా సాగుతుండడం, జూనియర్ ఎన్టీఆర్ వర్గాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పార్టీలో పొరపొచ్చాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో తన వర్గానికి చెందినవారిని ఎన్టీఆర్ వైయస్సార్ కాంగ్రెసులోకి పంపించడానికి ప్రణాళిక రచించారని అంటున్నారు.

మరో విషయం కూడా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలోని జూనియర్ ఎన్టీఆర్ వర్గీయులకు ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమా శుక్రవారం విడుదలైంది. అయితే, గుడివాడ మినహా కృష్ణా జిల్లాలో ఎక్కడా ఉదయం పూట షోలు వేయలేదు. దీనికి కారణం - తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అఖిల పక్షం బందరు పోర్టు సాధన కోసం బంద్‌కు పిలుపునివ్వడమే. కావాలనే బంద్‌కు పిలుపు ఇచ్చిన ఉదయం పూట తన సినిమా ఆడకుండా చేశారని జూనియర్ ఎన్టీఆర్ మండిపడుతున్నట్లు సమాచారం.

అయితే, చంద్రబాబు వర్గానికి చెందిన నాయకులు మరో విధంగా వాదిస్తున్నారు. కాంగ్రెసు మినహా అన్ని పార్టీలు కలిసి బందరు పోర్టు సాధన కోసం 27న బంద్ తలపెట్టాయని, ఆ తేదీ 20 రోజుల క్రితమే నిర్ణయమైందని, దమ్ము సినిమా అదే రోజు విడుదలవుతుందని తెలియదని, అప్పటికప్పుడు మార్చుకోవడానికి వీలు లేకుండా పోయిందని తెలుగుదేశం నాయకుడు బొండా ఉమామహేశ్వర రావు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. విజయవాడ తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్ష పదవి నుంచి వంశీని తప్పించి, బొండా ఉమామహేశ్వర రావును నియమించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

సినిమా ప్రదర్శన అపవద్దని తాము చెప్పామని, అయితే థియేటర్ యజమానులు అందుకు సిద్దపడలేదని, బంద్ అఖిల పక్షం ఆధ్వర్యంలో జరుగుతోంది కాబట్టి ఇతర పార్టీల వారు దాడి చేస్తే నష్టపోతామని, అందువల్ల సినిమా ప్రదర్శనను గంట ఆలస్యంగా తీసుకుంటామని చెప్పినట్లు ఆయన వివరించారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ వర్గీయులు ఈ వాదనను అంగీకరించడం లేదు.

కాగా, శాసనసభ్యుడు కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడలో మాత్రం ఆటంకాలేవీ లేకుండా దమ్ము సినిమా ఆడింది. బంద్‌కు కొడాలి నాని సహకరించలేదు. కొడాలి నాని కూడా జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చెందినవారే. గతంలో దేవినేని ఉమతో వంశీతో పాటు కొడాలి నాని విభేదించారు. ఆ తర్వాత కూడా చంద్రబాబు దేవినేనినే బలపరిచారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చెందిన నాయకులు మౌనంగా ఉండిపోయారు. అయితే, ఇటీవలి కాలంలో జగన్‌తో చేతులు కలపడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు. పరిటాల రవి అనుచరుడు చమన్‌ను కూడా జగన్ వైపు తీసుకు రావడానికి వంశీ ప్రయత్నించారని, చమన్ అందుకు అంగీకరించలేదని అంటున్నారు.

అయితే, మొత్తంగా ప్రస్తుత పరిణామానికి నందమూరి, నారా కుటుంబాల మధ్య చోటు చేసుకున్న వారసత్వ పోరు కారణమని అంటున్నారు. చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్‌ను తెర మీదికి తేవాలని ప్రయత్నించడం, దానికి బాలకృష్ణ సహకరిస్తుండడంతో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వేరు కుంపటి రాజేస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబుతో ఉండడం వల్ల ప్రయోజనం లేదని జూనియర్ ఎన్టీఆర్ తన సన్నిహితుల వద్ద అంటున్నట్లు కూడా టీవీ చానెల్ వ్యాఖ్యానించింది.

పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ మచిలీపట్నంలో రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. కొంత మంది ముఖ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులని చెబుతున్నారు. షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలా, వద్దా అనే విషయంపైనే కాకుండా ఇస్తే మౌఖికంగా ఇవ్వాలా, రాతపూర్వకంగా ఇవ్వాలా అనే విషయంపై వారు చర్చించినట్లు చెబుతున్నారు. అయితే, చంద్రబాబు వంశీ వివరణతో సంతృప్తి చెందుతారా, లేదా అనేది కూడా అనుమానంగానే ఉందని అంటున్నారు.

English summary
According to a TV news channel - Junior NTR has played a main role in meeting Telugudesam leader Vallabhaneni Vamshi meeting with YSR Congress party president YS Jagan at Viajayawad on friday evening. It is said that Jr NTR wants to send his men into YS Jagan's YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X