హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినీ తారలతో క్లోజ్‌నెస్?: భాను కిరణ్, కొందరి పేర్ల వెల్లడి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: కొమరం పులి, ఖలేజా చిత్రాల్లో నటించిన కొందరు తారలతో తాను సన్నిహితంగా ఉన్నానని సిఐడి అధికారుల దర్యాప్తులో మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ వెల్లడించినట్లు తెలుస్తోంది. సూరి హత్యకు ముందువరకు సినీ తారలతో జల్సాగా తిరిగిన తాను ఆ తర్వాత అజ్ఞాతంలో ఉన్నప్పుడు మాత్రం అష్టకష్టాలు పడ్డానని చెప్పాడు. అలాగే, తనతో సన్నిహితంగా ఉన్న తారల పేర్లను కూడా అతడు వెల్లడించినట్లు తెలుస్తోంది.

తాను ఇచ్చే పార్టీల్లో ఆ తారల సేవలను ఉపయోగించుకున్నాడన్న ఆరోపణలపై మాత్రం భాను పెద్దగా పెదవి విప్పలేదని తెలుస్తోంది. భానును నమ్ముకుని అతడి సాయంతో సెటిల్మెంట్లు చేయించుకున్న వారందరినీ అరెస్టు చేయడానికి సిఐడి పావులు కదుపుతోందని తెలుస్తోంది. అతనికి సాయం చేసిన వారి జాబితాను రూపొందిస్తోంది.

సుమారు 25కి పైగా వివాదస్పద సెటిల్‌మెంట్ల చిట్టాను తయారు చేశామని, వీటిలో తొమ్మిది గన్‌పాయింట్ బెదిరింపులతో జరిగాయని, వీటన్నింటిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న వారందరినీ గుర్తించామని సిఐడి అధికారులు చెబుతున్నారు. సూరి హత్య తర్వాత భానుపై నమోదైన కేసులతో పాటు అంతకుముందు వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన పాత కేసుల ఫైళ్ల దుమ్ము దులిపి ఆయా కేసుల్లో బాధ్యులను అరెస్టు చేయడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

కస్టడీలో భాను చెప్పిన వివరాల ఆధారంగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పరిశీలించి తదుపరి అరెస్టులకు వెళ్లాలని సిఐడి భావిస్తున్నట్లు తెలుస్తోంది. భానుకి మంగళి కృష్ణ నుంచి ఆయుధాలు అందిన నేపథ్యంలో ఆ ఆ యుధాలను స్వాధీనం చేసుకోవడానికి సిఐడి ప్రయత్నిస్తోంది. కృష్ణ నుంచి అందిన ఆయుధాలను అనంతపురం, హైదరాబాద్‌లో వేర్వేరు వ్యక్తులకు ఇచ్చామని దర్యాప్తు అధికారులకు భాను చెప్పినట్లు సమాచారం.

భాను అరెస్టు అయిన తర్వాత గతంలో ఆయుధాలు తీసుకుని దాచిన వారంతా పరారీ కావడంతో వారిని పట్టుకోవడానికి సిఐడిఅధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కృష్ణ నుంచి తీసుకున్న మరో తుపాకీని మధ్యప్రదేశ్‌లోని సియోనిలో దాచినట్లు భాను చెప్పడంతో అతడిని తీసుకుని సియోని వెళ్లి, ఆ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతే కృష్ణపై కేసు నమోదు చేసి అరెస్టుకు వెళ్లాలని ఉన్నతాధికారుల నుంచి దర్యాప్తు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

మద్దెలచెర్వు సూరిని హత్య చేసిన తర్వాత తనది కుక్క బతుకే అయిందని భాను కిరణ్ సిఐడి అధికారుల విచారణలో శనివారం చెప్పిన విషయం తెలిసిందే. అస్వస్థత కారణంగా శుక్రవారం భానును విచారించడం కుదరలేదు. శనివారంనాటి విచారణలో భాను కిరణ్ సిఐడి అధికారుల ముందు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. సూరి హత్యకు ముందు అమ్మాయిలతో మజా చేశానని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి. పబ్‌లు, క్లబ్‌లు తిరిగేవాడినని అతను చెప్పాడు.

సూరిని హత్య చేసిన తర్వాత కల్లు కాంపౌండ్లే వైన్ షాపులు అయ్యాయని, ఆర్టీసి బస్సులే లగ్జరీ కార్లు అయ్యాయని భాను కిరణ్ చెప్పినట్లు సమాచారం. తాను అప్పట్లో బ్లూ లేబుల్ మద్యం సేవించేవాడినని, తర్వాత నాటు సారా తాగాల్సి వచ్చిందని అతను చెప్పాడు. సూరి హత్యతో పరిటాల రవి వర్గానికి సంబంధం లేదని భాను చెప్పాడు. తాను బతకడం కోసం సూరిని హత్య చేశానని, సూరిని హత్య చేస్తే తనకు ముప్పు ఉంటుందని తెలుసునని అతను చెప్పాడు. సూరికి తెలియకుండా చేసిన సెటిల్మెంట్లే తన ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టాయని అతను అన్నాడు.

సూరి హత్యకు ముందు తన కుటుంబాన్ని అజ్ఞాతంలోకి పంపించానని, సూరి అనుచరులు ముప్పు తలపెడతారని అలా చేశానని అతను చెప్పాడు. అయితే సూరి అనుచరులు తన కుటుంబానికి ఏ విధమైన హాని చేయలేదని అతను చెప్పాడు. అరెస్టు కన్నా ముందు పాండిచ్చేరిలోని రెండు లాడ్జీల్లో ఉన్నట్లు అతను తెలిపాడు. సూరి హత్య తర్వాత ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాలు తిరిగినట్లు అతను చెప్పాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తాను ఏలాంటి వేషాలు వేయలేదని చెప్పాడు.

సిఐడి పోలీసులు ఊహించని రీతిలో తనను పట్టుకున్నారని, ఓ వ్యాపారవేత్త నుంచి లక్ష రూపాయల డబ్బులు తీసుకోవడానికి వస్తున్నప్పుడు జహీరాబాద్‌లో పట్టుకున్నారని అతను చెప్పాడు. తాము వ్యాపారవేత్తను అనుసరించి వెళ్లి భానును పట్టుకున్నట్లు సిఐడి అధికారులు చెప్పారు. తాను 15 నెలల పాటు 4 లక్షల 70 వేల రూపాయలతో కాలం గడిపినట్లు అతను తెలిపాడు.

English summary
It is said that Bhanu Kiran, who is main accused in Maddelacheruvu Suri murder case was accepted his closeness with some cine actors. Bhanu revealed his secrets in CID inquiry on Saturday. CID is grilling Bhanu Kiran about his activities and links. Bhanu Kiran has revealed his under ground life secrets also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X