ముబారక్‌కు జీవిత ఖైదు, కన్నీటిపర్యంతమైన నియంత

ఇదే నేరంపై అప్పటి అంతర్గత భద్రతా శాఖ మంత్రి హబీబ్ అల్ అడ్లీకి కూడా యావజ్జీవ శిక్షను విధించింది. అయితే, ముబారక్, ఆయన కుమారులపై ఉన్న ఆర్థిక నేరాలను మాత్రం కొట్టివేసింది. మూడు దశాబ్దాలపాటు ఈజిప్టును నిరంకుశంగా పాలించిన ముబారక్ పాలనపై గత ఏడాది ప్రజాగ్రహం వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈజిప్టులో శ్రీకారం చుట్టుకున్న తిరుగుబాటు మిగిలిన దేశాలకూ పాకింది. ప్రజలు వేలాదిగా వీధుల్లోకి వచ్చి ముబారక్ పాలనపై నిరసన వ్యక్తం చేశారు. తిరుగుబాటును జీర్ణించుకోలేకపోయిన ముబారక్ ప్రజాగ్రహ జ్వాలను ఆర్పివేయడానికి ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాడు.
వారిపై దేశంలోని వివిధ చోట్ల విచక్షణ రహితంగా కాల్పులు జరిపించాడు. ఈ కాల్పుల్లో 800 మందికిపైగా ఆందోళనకారులు మరణించారు. అయినా, తిరుగుబాటు కొనసాగడంతో అధ్యక్ష పదవి నుంచీ ముబారక్ వైదొలగాల్సి వచ్చింది. ముబారక్ దాష్టీకాలపై పది నెలలపాటు విచారణ కొనసాగింది. ఎట్టకేలకు ముబారక్‌కు, అప్పటి అంతర్గత భద్రతా శాఖ మంత్రి అడ్లీకి యావజ్జీవ (25 ఏళ్లు) కారాగార శిక్ష విధిస్తూ ప్రధాన న్యాయమూర్తి అహ్మద్ రఫాత్ శనివారం తీర్పును వెలువరించారు.
ఇదే కేసులో ఆరుగురు మాజీ పోలీసు కమాండర్లను నిర్దోషులుగా ప్రకటించారు. అంతేనా.. ముబారక్, ఆయన ఇద్దరు కొడుకులు అలా, గమాల్‌పై ఉన్న ఆర్థిక నేరాలు అన్నిటినీ కూడా కోర్టు కొట్టివేసింది. ఆ నేరాలు జరిగి పదేళ్లు దాటిపోయినందున వాటిని కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అయితే, ముబారక్ 30 ఏళ్ల పాలన ఈజిప్టునకు చీకటి రాజ్యమని, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కైరోలోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముబారక్‌ను స్ట్రెచర్‌పై కోర్టుకు తీసుకొచ్చారు.
తీర్పు సమయంలో ఏ స్పందనాలేని ముబారక్ కోర్టు నుంచి జైలుకు తీసుకెళ్లినప్పుడు మాత్రం కన్నీళ్లపర్యంతమయ్యారు. ఇక, కోర్టు కార్యకలాపాలు జరుగుతున్నంతసేపూ పెద్ద కొడుకు ఖురాన్‌లోని పంక్తులను చదువుతూనే ఉన్నాడు. విచిత్రం ఏమిటంటే.. ఈజిప్టు అధ్యక్ష పదవికి ఈనెల 16-17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ముబారక్ హయాంలో ప్రధాన మంత్రిగా పని చేసిన అహ్మద్ షాఫిక్, మహమ్మద్ మోర్సీలు తలపడుతున్నారు.
ఆ ఎన్నికలకు పక్షం రోజుల ముందే మాజీ అధ్యక్షుడు ముబారక్ జైలుపాలయ్యారు. తీర్పు వెలువడిన వెంటనే, కోర్టులోనూ, బయటా ముబారక్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఊచకోతలో మరణించిన ఆందోళనకారులు, వారి కుటుంబ సభ్యులు వందలాదిగా కోర్టుకు తరలి వచ్చారు. తీర్పు వెలువడిన వెంటనే ఆనందంతో గంతులు వేశారు. కోర్టు బయట ఈజిప్టు జెండాలు ఎగురవేస్తూ ముబారక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, ఈ కేసులో ముబారక్ ఇద్దరు కొడుకులను నిర్దోషులుగా ప్రకటించడంపై ఆందోళనకారుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications